అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (45; 39 బంతుల్లో), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (31; 22 బంతుల్లో) రాణించారు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేసింది. బ్రెవిస్ (46; 38 బంతుల్లో), రోహిత్ శర్మ (43; 29 బంతుల్లో) పోరాడారు.
అయితే ముంబై ఓటమి గురించి గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ షమి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పేలవమైన వ్యూహంతో బరిలోకి దిగాడని తెలిపాడు. ఏడో స్థానంలో హార్దిక్ బ్యాటింగ్ రావడాన్ని షమి తప్పుబట్టాడు. ధోనీలా ఆ స్థానంలో వచ్చి మ్యాచ్‌ను ముగించడం అందరికీ సాధ్యం కాదని అన్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా షమి వ్యాఖ్యలతో ఏకీభవించాడు.

''ధోనీ ఎప్పటికీ ధోనీనే. అతడిని ఎవరూ భర్తీ చేయలేరు. అయితే ప్రతి ఒక్కరి మైండ్‌సెట్ భిన్నంగా ఉంటుంది. ధోనీ, కోహ్లికి వాళ్ల వాళ్ల ఆలోచన ధోరణి ఉంటుంది. నైపుణ్యాన్ని బట్టి మ్యాచ్‌లో ఆటగాళ్లు నిలుస్తారు. గత రెండు సీజన్లలో హార్దిక్ మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కొన్ని సార్లు అయిదో స్థానంలో వచ్చాడు. ఇప్పుడు అదే తరహాలో ట్రై చేయాలి. ఏడో స్థానంలో కాదు'' అని షమి అన్నాడు. గత సీజన్‌లో పర్పుల్ క్యాప్ అందుకున్న షమి గాయంతో ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
ముంబై విజయానికి చివరి ఆరు ఓవర్లలో 48 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. కానీ ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదించలేదు. ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే హార్దిక్ ఏడో స్థానంలో రావడం వెనుక దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆలోచన కూడా ఉండొచ్చని మనోజ్ తివారీ అన్నాడు.
''ఇది హార్దిక్ పాండ్య ఒక్కడి ఆలోచనే కాదు అనిపిస్తుంది. గతంలో గుజరాత్ జట్టులో హార్దిక్, నెహ్రా మాత్రమే నిర్ణయాలు తీసుకునేవారు. కానీ ముంబై డగౌట్‌లో దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో హార్దిక్ దిగువన రావడంలో వాళ్ల పాత్ర ఉండవచ్చు. అంతేగాక యువ ప్లేయర్లు తిలక్ వర్మ, బ్రెవిస్‌కు అవకాశాలు ఇవ్వాలని భావించవచ్చు. సచిన్ మాటను కోచ్ మార్క్ బౌచర్ తప్పక వింటాడు. ఆ తర్వాత బౌచర్ జట్టు యాజమాన్యం, ఇతరులతో మాట్లాడి అదే నిర్ణయాన్ని తీసుకుని ఉంటాడు'' అని తివారీ పేర్కొన్నాడు.