ముంబై ఇండియన్స్‌కు ఊహించని కొత్త సమస్య ఎదురైంది. స్టార్ ఆల్‌రౌండర్ కొరత తీరాలని, జట్టు సమస్యలు తొలగిపోవాలని గుజరాత్ టైటాన్స్‌ను ఒప్పించి మరి హార్దిక్ పాండ్యను ముంబై ఫ్రాంచైజీ తిరిగి సొంతం చేసుకుంది. కానీ ఉన్న సమస్యలు తీరకపోగా కొత్త తలనొప్పి వచ్చి చేరింది.
రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్య మధ్య విభేదాలు ఉన్నట్లు జరిగిన ప్రచారం నిజమే అన్నట్లుగా తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే జట్టులో సఖ్యత లేదని తెలుస్తోంది. హార్దిక్ నాయకత్వ ఆలోచనలను రోహిత్‌తో పాటు బుమ్రా వ్యతిరేకించడం మైదానంలో స్పష్టంగా కనిపించింది. మరోవైపు హార్దిక్‌కు జట్టులో పాటు బయటా ఒత్తిడి పెరిగింది. ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అంతేగాక ఫామ్ కోల్పోవడం హార్దిక్‌కు మరింత భారంగా మారింది.

అయితే హార్దిక్‌కు ముంబై ఇండియన్స్ అభిమానుల మద్దతు దక్కేలా ఫ్రాంచైజీ ప్రయత్నాలు చేస్తోంది. తన సోషల్ మీడియా ఖాతాలో హార్దిక్ కంటే రోహిత్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రోహిత్‌కు అపారమైన గౌరవం ఇస్తున్నట్లు ప్రేక్షకుల్లో భావన కలిగించేలా హిట్ మ్యాన్‌కు సంబంధించిన పోస్ట్‌లను ఎక్కువగా అప్‌లోడ్ చేస్తోంది.
అయితే హార్దిక్ పాండ్యతో విభేదాలు ఏమీ లేవని, కెప్టెన్సీ మార్పు ఇష్టపూర్వకంగా జరిగిందని రోహిత్ శర్మ స్వయంగా చెప్పే వరకు ఈ వివాదం ముగిసిపోదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై రోహిత్ మౌనం వీడేంత వరుకు ఈ గొడవ కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు. కాగా, రోహిత్ ఇప్పటివరకు దీనిపై ఎందుకు స్పందించట్లేదని అసలు ప్రశ్న.
ఈ సమస్యను పరిష్కారించాలని రోహిత్ భావిస్తే ఈపాటికే వివరణ ఇచ్చేవాడు. కానీ రోహిత్ అలా చేయట్లేదు. కెప్టెన్సీ మార్పు ఏకపక్షంగా సాగిందని ప్రజలకు పరోక్షంగా రోహిత్ వెల్లడిస్తున్నడాని విశ్లేషకులు తమ వాదన వినిపిస్తున్నారు. మరోవైపు హార్దిక్- రోహిత్‌తో కలిసి ఓ చిన్న ఇంటర్వ్యూని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కలిసిన ఇంటర్వ్యూతో అయినా వివాదం సద్దుమణుగుతుందని భావిస్తున్నట్లు సమాచారం.
ఇంటర్వ్యూకి రోహిత్ ఒప్పుకోకపోతే సమస్య మరింత ముదురుతుంది. ఇక రోహిత్ మాటలు తమ అభిమానులు వినాలంటే హిట్ మ్యాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునే సందర్భం వరకు వేచి చూడాలి లేదా వ్యాఖ్యాతలు రోహిత్‌తో స్పెషల్‌గా ముచ్చటించే వరకు వెయిట్ చేయాలి. కాగా, ఉప్పల్ వేదికగా రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.