Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస ఓటములతో కుదేల్ అవుతోంది. తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పోరాడి ఓడింది. 287 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో చివరి బంతి వరకూ పోరాడింది గానీ అది సరిపోలేదు. 262 పరుగుల వద్ద దాని ప్రస్థానం ఆగిపోయింది.
ఆర్సీబీకి అది వరుసగా అయిదో ఓటమి. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లోనే గెలిచింది. రెండు పాయింట్లతోనే సరిపెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దాని స్థానం.. 10. ఇక తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 21వ తేదీన ఆడబోతోంది. కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఢీ కొట్టబోతోంది. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక.

ఈ ఓటమి తరువాత రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టం అయినట్టే. ఇంకా ఏడు మ్యాచ్‌లు ఆర్సీబీ చేతిలో ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్‌తో రెండు, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో ఒక్కొక్క మ్యాచ్ ఆడాల్సి ఉంది. కనీసం అయిదింట్లో భారీ రన్‌రేట్‌తో గెలిస్తే గానీ ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండవు.
ఈ పరిస్థితుల మధ్య ఆర్సీబీ, ఆ జట్టు బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ అభిమానులకు కాస్త ఊరట కలిగించే వార్త ఇది. విరాట్ కోహ్లీకి చెందిన మైనపు విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. దీని బరువు 35 కేజీలు. జైపూర్‌లోని ప్రఖ్యాత వ్యాక్స్ మ్యూజియంలో దీన్ని నేటి నుంచి అభిమానుల సందర్శనకు అనుమతి ఇచ్చారు.
నహర్‌ఘర్ ఫోర్ట్ సమీపంలో ఉందీ వ్యాక్స్ మ్యూజియం. జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఏపీజే అబ్దుల్ కలాం, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, కల్పనా చావ్లా, అమితాబ్ బచ్చన్, మదర్ థెరిసా వంటి ప్రముఖులకు చెందిన 44 విగ్రహాలు ఇందులో ఉన్నాయి. క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండుల్కర్ విగ్రహాలు మాత్రమే ఇక్కడ తీర్చిదిద్దారు. వారి సరసన చేరాడు కోహ్లీ.