ఎప్పటిలానే ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి నిరాశపరుస్తోంది. ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ తర్వాత సొంతమైదానంలో పంజాబ్ కింగ్స్‌పై గెలిచి ఘనంగా బోణీ కొట్టింది. కానీ ఆ తర్వాత హెమ్ గ్రౌండ్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైంది. కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో దారుణంగా ఓటమిపాలైంది.
నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లోనే గెలిచిన ఆర్సీబీ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో విరాట్ కోహ్లి అగ్రస్థానంలో నిలిచాడు. 67 సగటుతో 203 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. అయితే బెంగళూరు తిరిగి గెలుపు బాట పట్టాలంటే కోహ్లి 15వ ఓవర్ వరకు క్రీజులో ఉండాలని ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. అలాగే డుప్లెసిస్ మరింత బాధ్యతాయుతంగా ఆడాలని సూచించాడు.

''విరాట్ కోహ్లి మంచి ఆరంభాల్ని అలానే కొనసాగించాల్సి ఉంది. అదే జోరును మిడిల్ ఓవర్లలోనూ కంటిన్యూ చేయాలి. డుప్లెసిస్ మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. అయితే విరాట్ ఆరు ఓవర్లు తర్వాత క్రీజులో తప్పక ఉండాలి. అతడి నుంచి నేను ఆదే ఆశిస్తున్నాను. కోహ్లి 6 నుంచి 15 ఓవర్ల మధ్య బ్యాటింగ్ చేస్తే ఆర్సీబీ విధ్వంసంకరంగా పరుగులు సాధించగలదు''
''ఆర్సీబీ పేలవమైన ప్రారంభాలు చేయట్లేదు. అలా అనీ గొప్ప ఆరంభాలు చేయట్లేదు. సమస్య అంత మిడిల్‌లోనే ఉంది. అయితే ఆర్సీబీకి ఇప్పుడు విజయాలు అవసరం. వాళ్లు తిరిగి గెలుపు బాట పడతారని ఆశిస్తున్నా. తిరిగి హోమ్ గ్రౌండ్‌కు వచ్చేలోపు వాళ్లు సత్తాచాటి లయను అందుకుంటారని భావిస్తున్నా'' అని డివిలియర్స్ పేర్కొన్నాడు. శనివారం జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 11న వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో పోటీపడనుంది. ఏప్రిల్ 15న సొంతమైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది.