ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవి చూసింది. సొంతమైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 182 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (83*; 59 బంతుల్లో) టాప్ స్కోరర్. దినేశ్ కార్తీక్ (20*; 8 బంతుల్లో) ఆఖర్లో దూకుడుగా ఆడాడు.
అనంతరం ఛేదనలో కోల్‌కతా 16.5 ఓవరల్లో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. వెంకటేశ్ అయ్యర్ (50; 30 బంతుల్లో), సునిల్ నరైన్ (47; 22 బంతుల్లో), శ్రేయస్ అయ్యర్ (39*; 24 బంతుల్లో) విజయంలో కీలకపాత్ర పోషించారు.

అయితే ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ అంటే ఓ మినీవార్‌లా సాగుతుందనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. మునపటిలా కవ్వింపులు ఏమీ లేవు. ఆటగాళ్లు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సరదాగా మాట్లాడుకున్నారు. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి కూడా కలిసిపోయారు. గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు గంభీర్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో కోహ్లితో తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.
దీంతో ఈ సీజన్‌లో గంభీర్, కోహ్లి ఒకరినొకరు ఎలా పలకరించుకుంటారనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. కానీ గొడవకు వారిద్దరు ముగింపు పలికి ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు. మరోవైపు మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ (5*; 5 బంతుల్లో) బ్యాటును కోహ్లి పరిశీలించడం చర్చనీయాంశంగా మారింది. రింకూ బ్యాటును అనుమానించాడని కథనాలు కూడా వచ్చాయి.

అయితే రింకూ బ్యాటును కోహ్లి చెక్ చేయడానికి కారణం ఏంటో తర్వాత తెలిసింది. రింకూ సింగ్‌కు స్పెషల్ బ్యాటును గిఫ్ట్‌గా ఇవ్వడానికి కోహ్లి అలా చేశాడు. కోహ్లి తనకి కీలకమైన సలహాలు ఇచ్చాడని, అంతేగాక బ్యాటును గిఫ్ట్‌గా ఇచ్చాడని రింకూ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. ఈ విషయాన్ని కేకేఆర్ కూడా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఐపీఎల్‌లో సత్తాచాటి టీమిండియాలో చోటు దక్కించుకున్న రింకూ సింగ్ నయా ఫినిషర్‌గా ప్రశంసలు పొందుతున్నాడు.