ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ సంచలన ఆరోపణలు చేశాడు. హార్దిక్ మళ్లీ గాయపడ్డాడని, అందుకే బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడని సైమన్ అన్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో పవర్‌ప్లేలో బంతిని అందుకున్న హార్దిక్ ఆ తర్వాత మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసి పక్కకుతప్పుకున్నాడు.
ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్‌పై సైమన్ డౌల్ సందేహాం వ్యక్తం చేశాడు. హార్దిక్ గాయం విషయాన్ని దాచి పెడుతున్నారని అనుమానిస్తున్నాడు. ''తొలి గేమ్‌లో బౌలింగ్‌లో ఓపెనింగ్ స్పెల్ వేసి క్రికెట్ ప్రపంచానికి హార్దిక్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కానీ అకస్మాతుగా అతడు బౌలింగ్‌కు దూరమయ్యాడు. హార్దిక్ గాయపడ్డాడు. అతడి విషయంలో ఏదో తప్పు జరుగుతుందని అనిపిస్తోంది. దాన్ని హార్దిక్ ఒప్పుకోవట్లేదు. కచ్చితంగా అతడి విషయంలో ఏదో జరుగుతుందని నమ్ముతున్నాను'' అని సైమన్ డౌల్ పేర్కొన్నాడు.

వన్డే ప్రపంచకప్‌లో గాయపడిన హార్దిక్ కోలుకుని ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య మొదటి ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పవర్‌ప్లేలోనే బంతిని అందుకున్నాడు. కానీ తర్వాత రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ బౌలింగ్‌కు రాలేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్ బౌలింగ్ చేశాడు.

క్రమంగా పనిభారాన్ని తగ్గించుకోవడంతో హార్దిక్‌కు గాయం మళ్లీ తిరిగబెట్టిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకేవేళ సైమన్ డౌల్ చేసిన ఆరోపణలు నిజమైతే టీమిండియాకు ఇది గట్టి ఎదురుదెబ్బే. మరో నెలన్నర రోజుల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాల్గొనడం భారత్‌కు ఎంతో కీలకం. ఈ మెగాటోర్నీకి హార్దిక్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ అతనిపట్ల జాగ్రత్త వహించింది. దక్షిణాఫ్రికా పర్యటన, అఫ్గానిస్థాన్ టీ20, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లకు హార్దిక్‌ను పక్కనపెట్టింది. కానీ ఐపీఎల్‌తో హార్దిక్ మరోసారి గాయపడితే వరల్డ్ కప్‌కు అతను అందుబాటులో ఉండటం అనుమానమే.