ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విరాట్ కోహ్లి అడుగుపెట్టి సరిగ్గా ఇవాళతో 16 ఏళ్లు పూర్తయ్యాయి. అన్ని సీజన్లు ఒకే ఫ్రాంచైజీ ఆడిన ఏకైక ఆటగాడు కోహ్లి మాత్రమే. 237 మ్యాచ్‌ల్లో 7263 పరుగులు చేశాడు. 130 స్ట్రైక్‌రేటుతో పరుగుల వరద పారించాడు. అయితే వ్యక్తిగత కారణాలతో గత రెండు నెలలుగా కోహ్లి ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌తో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
చెపాక్ వేదికగా మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే చెపాక్ స్టేడియంలో ఇప్పటివరకు కోహ్లి ప్రదర్శన ఆకట్టుకనేలా లేదని టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. చెన్నైలో సిక్సర్లు సాధించడం గ్లెన్ మాక్స్‌వెల్‌కు కూడా కష్టమేనని అన్నాడు.

''ఈ వేదికలో ప్రదర్శన పరంగా విరాట్ కోహ్లి గొప్పతనం తగ్గిపోతుంది. టెన్నిస్ బాల్‌లా బౌన్స్ అయ్యే ఈ పిచ్ బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. ముఖ్యంగా ఓపెనర్లుకు క్లిష్టంగా ఉంటుంది. అంతేగాక రవీంద్ర జడేజా స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేస్తాడు. బంతిని టర్న్ చేస్తుంటాడు. తక్కువ ఎత్తులో సంధిస్తుంటాడు. ఇది బ్యాటర్లకు కష్టంగా ఉంటుంది''
''20 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేయాలనే ఆలోచనతో కోహ్లి బ్యాటింగ్‌కు వస్తే అతడు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. ఎందుకంటే చెపాక్‌లో రెండు వందల స్కోరు ఎక్కువగా సాధ్యం కాదు. 2016 సీజన్ తరహాలో కోహ్లి రాణించడం చాలా కీలకం. ఎందుకంటే కోహ్లి పరుగులు సాధిస్తేనే ఆర్సీబీ ముందుకు వెళ్తుంది. వాళ్లు కప్ సాధిస్తారా లేదా అనే విషయం నాకు తెలియదు. కానీ వాళ్ల వద్ద అద్భుత బ్యాటర్లు ఉన్నారు. విరాట్ కోహ్లి, మాక్స్‌వెల్, గ్రీన్, రజత్ పటిదార్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. అయితే ప్రతిఒక్కరూ 2016 సీజన్‌లో చెలరేగినట్లుగా కోహ్లి ఆడాలని కోరుకుంటాడు'' అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
2016 సీజన్‌లో కోహ్లి 16 మ్యాచ్‌ల్లో 973 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు బాదాడు. ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అయితే చెపాక్ స్టేడియంలో 30 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 985 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 90 పరుగులు.