మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టీమ్స్ బలబలాల గురించి మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. టీమిండియా మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆర్సీబీ, సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ జట్ల గురించి మాట్లాడాడు. స్టార్ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి ఈ సీజన్‌లో సత్తాచాటుతారని పేర్కొన్నాడు. మరోవైపు మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు నుంచి కోహ్లిని తప్పిస్తారని వస్తున్న వార్తలపై ఎమ్మెస్కే ప్రసాద్ పరోక్షంగా బదులిచ్చాడు. వరల్డ్ కప్‌లో కోహ్లి తప్పక ఉంటాడని పేర్కొన్నాడు. ''టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు కోహ్లి ఎంతో కీలకం. అతడి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఐపీఎల్ వేదికగా సెలక్టర్లు భావించరు. కోహ్లి ఫామ్ కారణంగా ఎప్పుడూ జట్టుకు దూరం కాలేదు. కుటుంబ కారణాలతోనే అతడు టీమిండియాకు దూరమయ్యాడు. సుదీర్ఘకాలం నుంచి అతడు ఫామ్‌లో ఉంటున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లోనూ అతడు సత్తాచాటుతాడు.

''ఇక ధోనీ విషయానికొస్తే.. 42 ఏళ్ల వయసులోనూ సీఎస్‌కే పట్ల ఉన్న నిబద్ధతను ధోనీ తెలియజేస్తున్నాడు. ఒకే ఫ్రాంచైజీకి ఎన్నో ఏళ్ల నుంచి అతను ఆడుతుండటంతో చెన్నై జట్టుకు, అభిమానులపై ఎంతో ప్రభావం చూపింది. ధోనీ గాయంతో గత సీజన్ మొత్తం ఆడాడు. టైటిల్ సాధించాడు'' అని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించి మిథాలీ రాజ్ మాట్లాడుతూ .. ఎస్‌ఆర్‌హెచ్‌లో ఎంతో మంది నాణ్యమైన విదేశీ ప్లేయర్లు ఉన్నారని, వాళ్లలో నలుగురును ఎంపిక చేయడమే అసలైన సమస్య అని అన్నారు.''కొత్త కెప్టెన్, కొత్త ప్లేయర్లపై ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యానికి అంచనాలు భారీగా ఉంటాయి. కానీ వాళ్లలో మ్యాచ్‌కు నలుగురు విదేశీ ప్లేయర్లను ఎంపిక చేయడమే చాలా ముఖ్యం. జట్టులో ఎంతో మంది నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారు'' అని మిథాలీ రాజ్ పేర్కొంది. మిథాలీ మాటలతో ఎమ్మెస్కే ప్రసాద్ ఏకీభవించాడు. విదేశీ ప్లేయర్లతో పాటు దేశీయ ప్లేయర్ల బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్‌గా ఉంటే సన్‌రైజర్స్‌కు తిరుగుండదని పేర్కొన్నాడు.