SRH vs RR: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో టాపర్ రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించిది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియంలో తొలుత బ్యాట్‌తో, అనంతరం బంతితో చెలరేగింది. ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి చెలరేగాడీ మ్యాచ్‌లో. 42 బంతుల్లో ఎనిమిది భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్- 42, ఓపెనర్ ట్రావిస్ హెడ్- 58 పరుగులతో మెరుపులు మెరిపించారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ధీటుగా ఆడింది. ప్రారంభ ఓవర్లల్లో తడబడినప్పటికీ ఆ తరువాత కుదురుకుంది. దాదాపుగా గెలిచింత పని చేసింది. ఒకదశలో 201 పరుగుల భారీ స్కోర్‌ను అలవోకగా ఛేదించేలా కనిపించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్- 67, టాప్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్- 77 పరుగులతో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు గానీ.. దాన్ని విజయంగా మలచుకోవడంలో విఫలం అయ్యారు.
మిడిల్ ఓవర్లల్లో ఒత్తిడికి లోనైంది రాజస్థాన్ రాయల్స్. వరుసగా వికెట్లను కోల్పోయింది. జైస్వాల్ అవుట్ అయ్యాక రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయిర్, ధృవ్ జురెల్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో పావెల్ అవుట్ కావడంతో 200 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్‌కు తెర పడింది.

రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఓ అన్ వాంటెడ్ రికార్డ్‌ను నెలకొల్పాడీ మ్యాచ్‌లో. ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డ్ ఇది. ఏ ప్లేయర్ కూడా అలాంటి రికార్డ్ కోరుకోడు. సింగిల్ స్పెల్‌లో ఆరు సిక్సర్లను సమర్పించుకున్న ఘనత చాహల్‌కు దక్కింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్ నాలుగు, నితీష్ కుమార్ రెడ్డి రెండు సిక్సర్లు కొట్టారు చాహల్ బౌలింగ్‌లో. అతని నాలుగు ఓవర్ల కోటాలో 62 పరుగులు పిండుకున్నారు సన్‌రైజర్స్ బ్యాటర్లు.
ఇలా ఒకే స్పెల్‌లో ఆరు సిక్సర్లను ఇవ్వడం చాహల్‌కు కొత్తేమీ కాదు. ఇదివరకే ఇలాంటి రికార్డ్ అతని పేరు మీద ఉంది. 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చాహల్ ఆరు సిక్సర్లు ఇచ్చాడు. అప్పట్లో అతను ఆర్సీబీకి ప్రాతినిథ్యాన్ని వహించిన విషయం తెలిసిందే.
అలాగే- తన నాలుగు ఓవర్ల కోటాలో 60కి పైగా పరుగులు ఇచ్చుకోవడం అతనికి ఇదే తొలిసారి. 50కి పైగా పరుగులు ఇచ్చుకున్న మ్యాచ్‌లు ఉన్నాయి గానీ 60 దాటడం ఇదే తొలిసారి. 2015లో ముంబైపై 2/51, 2014లో కేకేఆర్‌పై 0/50, 2023లో పంజాబ్ కింగ్స్‌పై 1/50, ఇదే సీజన్‌లో కేకేఆర్‌పై 1/54 పరుగులు ఇచ్చాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 0/62గా మరో చెత్త రికార్డ్ సాధించాడు.