SRH vs CSK: ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది సన్‌రైజర్స్‌కు. ఎందుకంటే ఇప్పటివరకు ఆడిన మూడింట్లో ఈ జట్టు గెలిచింది ఒక్కటంటే ఒక్కటే. రెండింట్లో ఓడింది. ప్రస్తుతం ఈ జట్లు ఖాతాలో ఉన్నవి రెండు పాయింట్లు మాత్రమే. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇందులోనూ ఓడిందంటే మున్ముందు టోర్నమెంట్‌లో ముందడుగు వేయడానికి చెమటోడ్చాల్సి ఉంటుంది.

చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి దీనికి భిన్నం. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లల్లో రెండింట్లో గెలిచింది. నాలుగు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ మంచి రన్‌రేట్‌తో నెగ్గగలిగితే తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియంలో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బకాయిలు పేరుకుపోయిన కారణంగా డిస్కమ్ అధికారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు షాకిచ్చారు. ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మ్యాచ్ ఇంకొన్ని గంటల్లో ఆరంభం కానున్న నేపథ్యంలో ఈ ఘటన సంభవించడం కలవరపాటుకు గురి చేసింది.
మొత్తంగా 3,05,12,790 కోట్ల రూపాయల మేర విద్యుత్ బిల్లును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. చెల్లించాల్సి ఉంది. ఈ విషయంపై హెచ్‌సీఏ యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. డిస్కమ్ అధికారులతో సంప్రదింపులు నిర్వహించింది. రెండు దశల్లో బిల్లులను చెల్లిస్తామని తెలిపింది. తొలి దశలో కోటిన్నర రూపాయల బిల్లులను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీనితో అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.