Gujarat Titans: ఐపీఎల్ మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అందరికీ షాకిచ్చింది. తొలి సీజన్‌లోనే ట్రోఫీ అందించి, రెండో సీజన్‌లో రన్నరప్‌గా నిలిపిన కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబైకి ట్రేడ్ చేసేసింది. ఈ నిర్ణయమే అర్థం కాక ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్‌కు మరో దిమ్మతిరిగే షాకిచ్చింది.
ఎవరూ దొరకనట్లు కుర్ర ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ను తమ టీం కెప్టెన్‌గా నియమించినట్లు ప్రకటించింది. ఈ డెసిషన్ చాలా మందికి నచ్చలేదు. దీని వల్ల ఆ టీంతోపాటు టీమిండియాకు కూడా నష్టమే అని అంటున్నారు. కేన్ విలియమ్సన్ వంటి అనుభవజ్ఞుడైన కెప్టెన్, డేవిడ్ మిల్లర్, మహమ్మద్ షమీ వంటి సీనియర్ ప్లేయర్లు ఉండగా గిల్‌ను ఎలా కెప్టెన్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి సమయంలో తనకు ఇలాంటి అవకాశం దక్కడంపై శుభ్‌మన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు ఇంకా ఆ ఫీలింగ్ మనసులోకి ఎక్కడం లేదని చెప్పాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడే వరకు తనకు ఈ ఫీలింగ్ పూర్తిగా బుర్రలోకి ఎక్కదని చెప్పుకొచ్చాడు. ఇలా ఐపీఎల్ జట్టును లీడ్ చేయాలనేది క్రికెట్ ఆడే ప్రతి కుర్రాడి కల అన్నాడు.
'మేం మా మొదటి మ్యాచ్ ఆడే వరకు ఈ ఫీలింగ్ పూర్తిగా మనసుకు ఎక్కేలా లేదు. ఇది చాలా గొప్ప ఫీలింగ్. ఐపీఎల్ మొదలైనప్పుడు నాకు 7 లేదా 8 సంవత్సరాలు ఉంటాయి. క్రికెటర్ అవ్వాలని అనుకునే ప్రతి కుర్రాడికీ.. అలాగే ఐపీఎల్ ఆడాలని అనుకునే ప్లేయర్లకు, ఇలా ఐపీఎల్ జట్టుకు సారధ్యం వహించాలనేది తప్పకుండా ఉండే కలే' అని గిల్ చెప్పాడు.
అలాంటి అవకాశం తనకు ఈ జట్టులో దొరికినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాల గురించి కూడా మాట్లాడాడీ కొత్త కెప్టెన్. 'కెప్టెన్సీతోపాటు ఇంకా ఎన్నో బాధ్యతలు వస్తాయని తెలిసిందే. వాటిలో కమిట్‌మెంట్, డిసిప్లిన్, హార్డ్ వర్క్, లాయల్టీలు చాలా ముఖ్యం' అని వివరించాడు