మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే ఈ మెగాటోర్నీలో భారత జట్టు తరఫున చోటు సంపాదించాలంటే ఆటగాళ్లకు ఐపీఎల్ ఎంతో కీలకం కానుంది. లీగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తేనే టీమిండియాలో అవకాశం దక్కే పరిస్థితులు ఏర్పడ్డాయి. కేవలం టీమిండియా మాత్రమే కాదు, ఇతర దేశాలు కూడా జట్టు ఎంపిక విషయంలో ఐపీఎల్‌లో తమ ఆటగాళ్ల ప్రదర్శనను అంచనా వేస్తున్నారు.
భారత జట్టులో మిడిలార్డర్‌లో చోటు కోసం ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నాలుగు, అయిదు బ్యాటింగ్ స్థానాల కోసం రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ మధ్య పోటీ ఏర్పడింది. అయితే ఈ ఆటగాళ్లందరిలో శివమ్ దూబె పోటీలో ముందు వరుసలో ఉన్నాడని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. దూబె నిలకడ ప్రదర్శన వల్ల సూర్యకుమార్, పంత్, కేఎల్ రాహుల్‌లపై ఒత్తిడి ఏర్పడిందని సెహ్వాగ్ అన్నాడు.

''శివమ్ దూబె అదరగొడుతున్నాడు. టీ20 ప్రపంచకప్ భారత జట్టులో దూబె స్థానం దాదాపు ఖరారైంది. ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పాను. అయితే దూబె.. రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి పెంచాడు. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం వాళ్లంతా నిలకడగా పరుగులు చేయాల్సిన పరిస్థితి తీసుకువచ్చాడు. అయితే ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లనే జట్టులో ఎంపిక చేయాలని భావిస్తున్నా'' అని సెహ్వాగ్ తెలిపాడు.

కాగా, సూర్యకుమార్ యాదవ్ ఇవాళ జరగనున్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడిన సూర్య డిసెంబర్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తాజాగా పూర్తి ఫిట్‌నెస్ సాధించి ముంబై ఇండియన్స్ జట్టుతో చేరాడు. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ముంబై అన్నింట్లోనూ ఓటమిపాలైంది. సూర్య రాకతో తిరిగి గెలుపు బాట పట్టాలని ముంబై ఫ్రాంచైజీ భావిస్తోంది.