Shikhar Dhawan: ఐపీఎల్ 2024 సీజన్‌లో మరోసారి నిరాశ పరిచింది పంజాబ్ కింగ్స్. ఈ సీజన్‌లో కూడా ప్లేఆఫ్స్ వరకు వెళ్లలేకపోయింది. లీగ్స్ దశలోనే దాని ప్రస్థానం ముగిసింది. ఇంకో మ్యాచ్ చేతిలో ఉన్నప్పటికీ- అందులో గెలిచినా ఎలాంటి ఉపయోగం ఉండదా జట్టుకు.
ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌లల్లో గెలిచింది అయిదే. ఎనిమిదింట్లో ఓడింది పంజాబ్. మొత్తం 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ నెల 19వ తేదీన చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతోంది. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కొనబోతోంది.

ఈ జట్టుకు సారథ్యాన్ని వహిస్తోన్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా మ్యాచ్‌లు ఆడట్లేదు. అతని స్థానంలో తాత్కాలికంగా ఆల్‌రౌండర్ సామ్ కుర్రన్ జట్టు పగ్గాలను అందుకున్నాడు. అయినప్పటికీ- దాని తలరాత మారలేదు. వరుస పరాజయాలతో కుదేల్ అయిందా టీమ్.
ఈ పరిస్థితుల మధ్య శిఖర్ ధావన్ నుంచి ఓ కొత్త అప్‌డేట్ వెలువడింది. అతను బుల్లితెరపై అడుగు పెట్టాడు. ఓ ఛాట్ షోనకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నాడు. దీని పేరు ధావన్ కరెంగే. వన డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్ ప్రొడ్యూస్ చేసిన ఈ ఛాట్ షో తొలి ఎపిసోడ్ ఈ నెల 20వ తేదీన టెలికాస్ట్ కానుంది. జియో సినిమా ప్రీమియంలో ఇది ప్రసారమౌతుంది.
ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ఎంటర్‌టైన్‌మెంట్ సెగ్మెంట్‌లో అడుగుపెట్టినట్లు చెప్పాడు. క్రికెట్ ద్వారా మాత్రమే కాకుండా ఈ ఛాట్ షో ద్వారా అభిమానులతో కనెక్ట్ అయి ఉండాలనే ఉద్దేశంతోనే దీన్ని హోస్ట్ చేయడానికి అంగీకరించినట్లు చెప్పాడు.
స్పోర్ట్స్, మూవీస్, ఇండస్ట్రీస్, బిజినెస్, ఎంటర్టైన్‌మెంట్.. ఇలా అన్ని రకాల ఫ్లేవర్‌ను ప్రజలకు అందించేలా ఈ ఛాట్ షోను డిజైన్ చేసినట్లు తెలిపాడు. అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, క్రికెటర్ రిషభ్ పంత్, కమేడియన్ భువన్ బమ్.. ఇలా వేర్వేరు రంగాలకు చెందిన సెలెబ్రిటీలతో నిర్వహించిన ఎపిసోడ్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయని అన్నాడు.