ఐపీఎల్-2024 ముగిసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. చెపాక్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేకేఆర్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తుదిపోరు ఏకపక్షంగా సాగినా ఈ సీజన్ మాత్రం హోరాహొరీగా సాగింది. క్రికెట్ అభిమానులకు ఫుల్ మీల్స్ అందాయి. స్టేడియం బయటపడిన సిక్సర్లు, వికెట్లు ఎగిరిపడిన వికెట్లు, మెరుపు ఫీల్డింగ్ విన్యాసాలతో ఈ సీజన్ వినోదాన్ని పంచింది.
ఇక మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో రికార్డుల మోత మోగాయి. సగటున మ్యాచ్‌కో అరుదైన ఘనతలు నమోదయ్యాయి. రసవత్తరంగా మ్యాచ్‌లు సాగడంతో రికార్డులు పోటెత్తాయి. ఐపీఎల్ చరిత్రలో 2024 సీజన్ ప్రత్యేకంగా నిలిచేలా రికార్డులు నమోదయ్యాయి. లీగ్ హిస్టరీలో ఈ సీజన్‌లో నమోదైన రన్ రేటే (9.56) అత్యధికం.
అంటే ఈ సీజన్ ఇన్నింగ్స్ సగటు స్కోరు ఏకంగా 191.

ఇక ఐపీఎల్-2024లో 200+ స్కోర్లు ఏకంగా 41 సార్లు నమోదవ్వడం విశేషం. అంతేగాక బ్యాటర్లు 1260 సిక్సర్ల మోత మోగించారు. ఈ సీజన్‌లో 14 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఇవన్నీ ఆల్‌టైమ్ రికార్డులు. ఈ సీజన్‌లో అత్యధిక టీమ్ స్కోరు, అత్యధిక ఛేజింగ్ స్కోర్ల రికార్డులు బద్దలయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిన 287 పరుగులు లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.
ఈ సీజన్‌లో రికార్డు ఛేదన కూడా నమోదైంది. ఛాంపియన్ కేకేఆర్‌పై పంజాబ్ కింగ్స్ 262 పరుగుల స్కోరు ఛేదించింది. లీగ్ హిస్టరీలో ఇదే టాప్ ఛేజింగ్ స్కోరు. ఇక అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్ రికార్డు కూడా ఈ సీజన్‌లోనే సాధ్యమైంది. బెంగళూరు వేదికగా ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 549 పరుగులు నమోదయ్యాయి. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో అంతిమంగా హైదరాబాద్ గెలిచింది.
ఇక ఫైనల్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలోనే 113 పరుగులకు ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్స్‌లో ఓ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు.కెప్టెన్ కమిన్స్ (24; 19 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్. కోల్‌కతా బౌలర్లలో రసెల్ (3/19) మూడు, స్టార్క్ (2/14), హర్షిత్ రాణా (2/24) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో కేకేఆర్ రెండు వికెట్లు కోల్పోయి 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. వెంకటేశ్ అయ్యర్ (52; 26 బంతుల్లో, 4x4, 3x6) అజేయ అర్ధశతకం సాధించాడు.