జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి శతకం సాధించాడు. 72 బంతుల్లో అజేయంగా 113 పరుగులు చేశాడు. 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కోహ్లి చరిత్రకెక్కాడు. పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటివరకు కోహ్లి తొమ్మిది సెంచరీలు బాదాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఎనిమిది, టీమిండియా తరఫున ఓ సెంచరీ బాదాడు.
ఇక కోహ్లి సెంచరీతో చెలరేగడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44; 33 బంతుల్లో)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లి తొలి వికెట్‌కు 125 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఈ క్రమంలో కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. లీగ్‌లో కోహ్లి ఇప్పటివరకు 28 సెంచరీల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. కోహ్లి తర్వాతి స్థానంలో డేవిడ్ వార్నర్ (26) ఉన్నాడు.

ఇక 100 పరుగుల భాగస్వామ్యం అత్యధికసార్లు నెలకొల్పిన మూడో ఓపెనింగ్ జోడీగా కోహ్లి-డుప్లెసిస్ జంట నిలిచాడు. వీరిద్దరు అయిదు సార్లు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్-శిఖర్ ధావన్ (6), డేవిడ్ వార్నర్-జానీ బెయిర్‌స్టో (5) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక ఏ వికెట్‌కు అయినా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జాబితాలో విరాట్ కోహ్లి-ఏబీ డివిలియర్స్ (10) జోడీ అగ్రస్థానంలో ఉంది.
ఇక ఆర్సీబీ ఇన్నింగ్స్ విషయానికొస్తే.. విరాట్ కోహ్లి, డుప్లెసిస్ ఆది నుంచే దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించడంతో బెంగళూరు పవర్‌ప్లేలో 53 పరుగులు చేసింది. అయితే రాజస్థాన్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్‌ప్లే అనంతరం ఆర్సీబీ స్కోరు వేగం తగ్గింది. కానీ బౌల్ట్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో డుప్లెసిస్ రెండు సిక్సర్లు బాదాడు. అనంతరం కోహ్లి, డుప్లెసిస్ క్రమం తప్పకుండా ఓవర్‌కు ఓ బౌండరీ చొప్పున సాధిస్తూ పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కోహ్లి 38 బంతుల్లో అర్ధశతకాన్ని సాధించాడు. రియాన్ పరాగ్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాది ఈ ఘనత అందుకున్నాడు.
మరోవైపు అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్న డుప్లెసిస్‌ను చాహల్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మాక్స్‌వెల్ (1; 3 బంతుల్లో) మరోసారి నిరాశపరిచాడు. బర్గర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అరంగేట్ర ప్లేయర్ సౌరవ్ చౌహన్ (9; 6 బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరోఎండ్‌లో బ్యాటర్ల నుంచి సహకారం గొప్పగా లభించనప్పటికీ కోహ్లి తనదైన రీతిలో చెలరేగాడు. 67 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఐపీఎల్‌లో కోహ్లికి ఇది 8వ సెంచరీ. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు, బర్గర్ ఓ వికెట్ తీశారు.