ఐపీఎల్ -2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. జైపుర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న రాజస్థాన్ సొంతమైదానంలో మరో గెలుపును అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఆర్‌ఆర్ మూడింట్లో విజయం సాధించి పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచింది.
మరోవైపు బెంగళూరు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయమే అందుకుంది. హెమ్‌గ్రౌండ్‌లో గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. ఇవాళ రాజస్థాన్‌పై పైచేయి సాధించి తిరిగి గెలుపు బాట పట్టాలని ఆర్సీబీ కసిగా బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లి వర్సెస్ సందీప్ శర్మ పోటీపై ఆసక్తి నెలకొంది. 67 బంతుల్లో కోహ్లిని సందీప్ ఏడు సార్లు ఔట్ చేయడం గమనార్హం. అలాగే సందీప్ వేసిన 15 బంతుల్ని ఎదుర్కొన్న మాక్స్‌వెల్ రెండు సార్లు ఔట్ అయ్యాడు.

కాగా, టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తమ తుది జట్టులో ఎలాంటి మార్పులేదని, గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని శాంసన్ పేర్కొన్నాడు. మరోవైపు ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ తమ జట్టులో ఓ మార్పు జరిగిందని తెలిపాడు. అనుజ్ రావత్ స్థానంలో సౌరవ్ చౌహన్ జట్టులోకి వచ్చాడని వెల్లిడించాడు. ఇటీవల జరిగిన వేలంలో చౌహన్‌ను ఆర్సీబీ రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది.
తుదిజట్టు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, సౌరవ్ చౌహన్, దినేశ్ కార్తీక్, మయాంక్ దాగర్, రీస్ టోప్లే, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
రాజస్థాన్ రాయల్స్: బట్లర్, యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, నాంద్రె బర్గర్, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్.