విరాట్ కోహ్లి కళాత్మక విధ్వంసం సృష్టించాడు. కళ్లుచెదిరే సిక్సర్లు, సొగసైన బౌండరీలతో పరుగుల మోత మోగించాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ సెంచరీ సాధించాడు. 72 బంతుల్లో అజేయంగా 113 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కోహ్లికి ఇది 8వ సెంచరీ. కోహ్లితో పాటు.. డుప్లెసిస్ (44; 33 బంతుల్లో) కూడా సత్తాచాటడంతో రాజస్థాన్ రాయల్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 184 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఆది నుంచే విరాట్ కోహ్లి, డుప్లెసిస్ చెలరేగారు. తొలి వికెట్‌కు 14 ఓవర్లలో 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించడంతో ఆర్సీబీ పవర్‌ప్లేలో 53 పరుగులు చేసింది.

అయితే రాజస్థాన్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్‌ప్లే అనంతరం ఆర్సీబీ స్కోరు వేగం తగ్గింది. కానీ బౌల్ట్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో డుప్లెసిస్ రెండు సిక్సర్లు బాదాడు. అనంతరం కోహ్లి, డుప్లెసిస్ క్రమం తప్పకుండా ఓవర్‌కు ఓ బౌండరీ చొప్పున సాధిస్తూ పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కోహ్లి 38 బంతుల్లో అర్ధశతకాన్ని సాధించాడు. రియాన్ పరాగ్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాది ఈ ఘనత అందుకున్నాడు.
మరోవైపు అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్న డుప్లెసిస్‌ను చాహల్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మాక్స్‌వెల్ (1; 3 బంతుల్లో) మరోసారి నిరాశపరిచాడు. బర్గర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అరంగేట్ర ప్లేయర్ సౌరవ్ చౌహన్ (9; 6 బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరోఎండ్‌లో బ్యాటర్ల నుంచి సహకారం గొప్పగా లభించనప్పటికీ కోహ్లి తనదైన రీతిలో చెలరేగాడు. 67 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఐపీఎల్‌లో కోహ్లికి ఇది 8వ సెంచరీ. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు, బర్గర్ ఓ వికెట్ తీశారు.