Jos Buttler: ఐపీఎల్ 2024 సీజన్ 17వ ఎడిషన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తన అయిదో మ్యాచ్ ఆడబోతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. సాయంత్రం 7:30 గంటలకు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో మ్యాచ్ మొదలవుతుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇప్పటివరకు ఆడిన నాలుగింట్లో ఈ జట్టు గెలిచింది ఒక్కటంటే ఒక్కటే. మూడింట్లో ఓడింది. ప్రస్తుతం ఈ జట్లు ఖాతాలో ఉన్నవి రెండు పాయింట్లు మాత్రమే. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇందులోనూ ఓడిందంటే పరువు పోగొట్టుకుంటుంది ఆర్సీబీ.

రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. టోర్నమెంట్‌లో జైత్రయాత్ర సాగిస్తోందా జట్టు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లనూ క్లీన్ స్వీప్ చేసింది. ఆరు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ నెగ్గితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్‌కు చిరస్మరణీయంగా మారబోతోంది. ఇది అతనికి 100వ ఐపీఎల్ మ్యాచ్. ఇప్పటికి 99 మ్యాచ్‌లను ఆడాడు బట్లర్. 3,258 పరుగులు చేశాడు. ఇందులో అయిదు సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని హయ్యెస్ట్ స్కోర్ 124. 2016లో తొలిసారిగా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన బట్లర్.. ఇప్పటివరకు నిరంతరాయంగా ఆడుతూనే వస్తోన్నాడు. ఏ సీజన్ కూడా మిస్ కాలేదు.
2022లో అత్యధికంగా 863 పరుగులు చేశాడు. ఆ ఏడాదే ఆడిన 17 మ్యాచ్‌లల్లో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. దాని తరువాత మళ్లీ అలాంటి ఫామ్‌ను అందిపుచ్చుకోవడంలో బట్లర్ విఫలమౌతోన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లల్లో అతను చేసింది 35 పరుగులే.