ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘనంగా బోణీ కొట్టింది. జైపుర్ వేదికగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్‌ఆర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.
తొలుత రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 193 పరుగులు చేసింది. సంజు శాంసన్ (82*; 52 బంతుల్లో) సూపర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రియాన్ పరాగ్ (43; 29 బంతుల్లో) ఆకట్టుకున్నాడు. యశస్వీ జైస్వాల్ (24; 12 బంతుల్లో), ధ్రువ్ జురెల్ (20*; 12 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు. అనంతరం ఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (64*; 41 బంతుల్లో) , కేఎల్ రాహుల్ (58; 44 బంతుల్లో) పోరాడారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం దక్కలేదు. 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ (2/35), బర్గర్ ధాటికి డికాక్ (4; 5 బంతుల్లో), దేవదత్ పడిక్కల్ (0; 3 బంతుల్లో), ఆయుష్ బదోని (1; 5 బంతుల్లో) వరుసగా పెవిలియన్‌కు చేరారు. దీపక్ హుడా (26; 13 బంతుల్లో) దూకుడుగా ఆడటంతో లక్నో పవర్‌ప్లేలో 47 పరుగులు చేసింది. కానీ దీపక్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పూరన్‌తో కలిసి రాహుల్ జాగ్రత్తగా ఆడటంతో లక్నో 10 ఓవర్లకు 76/4 స్కోరు మాత్రమే చేసింది. అనంతరం రాహుల్, పూరన్ పూనకం వచ్చినట్లు విరుచుకుపడ్డారు. తర్వాత మూడు ఓవర్లలో 46 పరుగులు సాధించి మ్యాచ్‌ను తమ వైపుకు లాకున్నారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 50 హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే సందీప్ శర్మ రాజస్థాన్ రాయల్స్‌ను తిరిగి పోటీలోకి తెచ్చాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ రాహుల్‌ను 17వ ఓవర్‌లో ఔట్ చేశాడు. మరోవైపు పూరన్ తన పోరాటం కొనసాగించాడు. 30 బంతుల్లో అర్ధశతకాన్ని బాదాడు. కానీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
శాంసన్ మాస్ ఇన్నింగ్స్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం దక్కలేదు. జోస్ బట్లర్ (11; 9 బంతుల్లో) ఆదిలోనే ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ సూపర్ డైవ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. వికెట్ పడినా రాజస్థాన్ దూకుడుగానే బ్యాటింగ్ చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన శాంసన్‌తో కలిసి యశస్వీ జైస్వాల్ (24; 12 బంతుల్లో) బౌండరీల మోత మోగించాడు. అయిదో ఓవర్‌లో జైస్వాల్ ఔటైనప్పటికీ ఆర్ఆర్ పవర్‌ప్లేలో 54 పరుగులు చేసింది.
కాగా, నాలుగో స్థానంలో వచ్చిన రియాన్ పరాగ్ తో కలిసి శాంసన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. నాలుగో వికెట్‌కు 93 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో 33 బంతుల్లో శాంసన్ హాఫ్ సెంచరీ సాధించాడు. శాంసన్‌కు తోడుగా రియాన్ కూడా దూకుడు పెంచడంతో పరుగులు పోటెత్తాయి. అయితే భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి పరాగ్ ఔటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెట్‌మెయిర్ (5; 7 బంతుల్లో)ను కూడా లక్నో వెంటనే ఔట్ చేసి తిరిగి పోటీలోకి వచ్చింది. కానీ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (20; 12 బంతుల్లో)తో కలిసి సంజు శాంసన్ స్కోరు బోర్డు ముందుకు నడిపించాడు. శాంసన్ మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీనుల్ హక్ రెండు వికెట్లు, మోహ్సిన్, రవి బిష్ణోయ్ ఒక్క వికెట్ తీశారు. కృనాల్ పాండ్య నాలుగు ఓవర్లు వేసి 19 పరుగులే ఇచ్చాడు.