ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇవాళ తమ తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. జైపుర్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (24; 12 బంతుల్లో) దూకుడుకు ఆర్‌ఆర్ పవర్‌ప్లేలో 54 పరుగులు సాధించింది.
మరో ఓపెనర్ జోస్ బట్లర్ (11; 9 బంతుల్లో) నిరాశపరిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్, లక్నో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య ఒకరినొకరు ఢీ కొన్నారు. ఫలితంగా రియాన్ పరాగ్ ఔట్ కాకుండా తప్పించుకున్నాడు. అసలేం జరిగిందంటే..

కృనాల్ పాండ్య ఆరో ఓవర్ బౌలింగ్ వేశాడు. రెండో బంతికి రియాన్ పరాగ్ స్ట్రైకింగ్‌లో, సంజు శాంసన్ నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. అయితే కృనాల్ వేసిన బాల్‌ను అంచనా వేయలేక రియాన్ పరాగ్ గాల్లోకి షాట్ ఆడాడు. అది సంజు శాంసన్ పక్కనుంచి వెళ్లింది. కృనాల్ దాన్ని అందుకోవడానికి ప్రయత్నించగా శాంసన్ అక్కడే అడ్డంగా నిలబడ్డాడు. క్యాచ్ అందుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ శాంసన్ వల్ల కృనాల్ అందుకోలేకపోయాడు.
సంజు శాంసన్ తన ప్లేస్‌లోనే ఉంటంతో అది అబ్‌స్ట్రక్షన్ ఫీల్డింగ్ కిందకు కూడా రాలేదు. మరోవైపు కృనాల్ పాండ్య ఈ ఘటనపై సీరియస్ అవ్వలేదు. సంజు శాంసన్‌కు నవ్వుతూ హగ్ ఇచ్చాడు. ఇవాళ కృనాల్ బర్త్‌డే కావడంతో కామ్‌గా ఉన్నాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. బర్త్‌డే బాయ్ కృనాల్ పాండ్య నాలుగు ఓవర్లు వేసి కేవలం 19 పరుగులే ఇచ్చాడు. వికెట్ సాధించనప్పటికీ మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు.
మరోవైపు సంజు శాంసన్ పుణ్యమా అని ఔట్ కాకుండా తప్పించుకున్న రియాన్ పరాగ్ తర్వాత రెచ్చిపోయాడు. దూకుడుగా పరుగులు సాధించాడు. 29 బంతుల్లో 43 పరుగులు చేశాడు. మూడు సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. పరాగ్‌కు ఖాతా తెరవక ముందు, 29 పరుగుల వద్ద రెండు సార్లు లైఫ్ లభించడం గమనార్హం.