Ravichandran Ashwin: ఐపీఎల్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి పరాజయాన్ని చవి చూసింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో మట్టికరిచింది. ఈ సీజన్‌లో ఈ జట్టుకు ఇదే తొలి ఓటమి. సొంతగడ్డపై 196 పరుగుల భారీ స్కోర్ సాధించినా దాన్ని కాపాడుకోలేకపోయింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్, కేప్టెన్ సంజు శాంసన్ ఈ మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. 38 బంతుల్లో రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో సంజు శాంసన్ 68, 48 బంతుల్లో అయిదు భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో రియాన్ పరాగ్ 76 పరుగులు చేశారు.

చివరి ఓవర్‌లో షిమ్రాన్ హెట్మెయిర్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. అయిదు బంతుల్లో ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లల్లో 199 పరుగులతో విజయఢంకా మోగించింది. ఈ క్రమంలో ఏడు వికెట్లను కోల్పోయింది.
తొలి వికెట్ భాగస్వామ్యానికి శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఏకంగా 64 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి శుభారంభం చేసినప్పటికీ.. టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడం వల్ల గుజరాత్ టైటాన్స్ ఓ దశలో ఓటమి కోరల్లో చిక్కుకున్నట్టు కనిపించింది. చివర్లో రషీద్ ఖాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 11 బంతుల్లో నాలుగు బుల్లెట్ల వంటి ఫోర్లతో 24 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ వివాదాస్పదంగా వ్యవహరించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నింగ్ 17వ ఓవర్‌ను వేశాడు అశ్విన్ ఆ ఓవర్ రెండో బంతి వేయడానికి ముందు- అశ్విన్ ఫీల్డింగ్ కొన్ని మార్పులు చేశాడు. ఆ సమయంలో షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా ఉన్న ఫీల్డర్‌ను వెనక్కి వెళ్లాలంటూ అసహనంగా మాట్లాడాడు.
ఆ శనిగాడిని వెనక్కి వెళ్లి నిలబడమని చెప్పు.. అంటూ సంజు శాంసన్‌కు గట్టిగా చెప్పాడు. దీనితో అతను వెంటనే ఆ ప్లేయర్‌ను వెనక్కి వెళ్లి నిల్చోరా రేయ్ అంటూ అరిచాడు. అశ్విన్ గట్టిగా మాట్లాడటం- నాన్ స్ట్రైకింగ్ ఎండ్ స్టంప్స్‌కు అమర్చిన మైక్‌లో రికార్డయింది. రాజస్థాన్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్, సంజు శాంసన్‌కు మాత్రమే తమిళం తెలుసు.
ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన విషయం తెలిసిందే. తన నాలుగు ఓవర్ల కోటాలో 40 పరుగులు ఇచ్చాడు. అశ్విన్ వేసిన 17వ ఓవర్‌లో ఒక సిక్సర్, ఒక బౌండరీతో సహా 17 పరుగులను పిండుకున్నారు బ్యాటర్లు. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌పై పట్టు సాధించడానికి ఈ ఓవరే కీలకంగా మారింది.