MS Dhoni: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్.. ఇంకొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. ఈ రాత్రి 8 గంటలకు టాస్ పడబోతోంది. 74 రోజుల పాటు కొనసాగుతుందీ మెగా ఈవెంట్. కప్ కోసం మొత్తం 10 జట్లు పోటీ పడబోతోన్నాయి.
గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. తొలి మ్యాచ్‌లోనే టఫ్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ రెండు జట్లకూ ప్రతిష్ఠాత్మక పోరు ఇది. తొలి మ్యాచ్ నుంచే జైత్రయాత్ర మొదలుపెట్టాలనే పట్టుదలతో ఉన్నాయవి. చెన్నైలోని చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది.

ఐపీఎల్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది. ఇన్ని సంవత్సరాలుగా జట్టుకు సారథ్యాన్ని వహిస్తూ వస్తోన్న లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీని కేప్టెన్ హోదా నుంచి తప్పించింది. అతని స్థానంలో డాషింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు జట్టు పగ్గాలను అప్పగించింది.
ఐపీఎల్ టోర్నమెంట్ మొత్తానికీ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ఏదైనా ఉందంటే అది సూపర్ కింగ్సే. ముంబై ఇండియన్స్‌తో సమానంగా అయిదుసార్లు ఛాంపి నిలిచింది ఈ ఎల్లో ఆర్మీ. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్‌లల్లో కప్ కొట్టిందీ టీమ్. అన్నిసార్లూ ధోనీనే కేప్టెన్. అలాంటి సారథిని టోర్నమెంట్ ఆరంభం కావడానికి చివరి నిమిషంలో తొలగించడం కలకలం రేపుతోంది.
దీనిపై ముంబై ఇండియన్స్ మాజీ కేప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఎంఎస్ ధోనీని జట్టు కేప్టెన్‌గా తొలగించి, రుతురాజ్ గైక్వాడ్‌ను అపాయింట్ చేసినట్లు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్‌కు పని చెప్పాడు. ధోనీతో కలిసి దిగిన ఓ ఫొటో, దానికి షేక్ హ్యాండ్ ఎమోజీని యాడ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు.
ఈ సీజన్‌కు రోహిత్ శర్మ కూడా కేప్టెన్ ఉండట్లేదనే విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కూడా అతన్ని కేప్టెన్‌గా తప్పించింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఆ బాధ్యతలను అప్పగించింది. అప్పట్లో అదే పెద్ద సంచలనం అనుకుంటే ఇప్పుడు ఏకంగా ధోనీపైనే వేటు పడటం ఫ్యాన్స్‌కు మంట పెట్టినట్టయింది.