రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న హార్దిక్ పాండ్య తొలి మ్యాచ్‌లో విజయవంతం కాలేకపోయాడు. జట్టు యాజమాన్యం నుంచి మద్దతు ఉన్నప్పటికీ అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడిలో హార్దిక్ తడబడ్డాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబైను గెలిపించలేకపోయాడు. బౌలింగ్, బ్యాటింగ్, కెప్టెన్సీలో తన మార్క్‌ను చూపించలేకపోయాడు.
ఆదివారం రాత్రి గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (45; 39 బంతుల్లో), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (31; 22 బంతుల్లో) రాణించారు. బుమ్రా మూడు వికెట్లతో సత్తాచాటాడు.

అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేసింది. బ్రెవిస్ (46; 38 బంతుల్లో), రోహిత్ శర్మ (43; 29 బంతుల్లో) పోరాడారు. అయితే రోహిత్, బ్రెవిస్ దాటికి ఓ దశలో ముంబై 12 ఓవర్లకు 107/2తో మెరుగైన స్థితిలో ఉంది. రోహిత్ ఔటైనప్పటికీ ముంబై విజయ సమీకరణం 8 ఓవర్లలో 48 పరుగులే. కానీ ముంబై జట్టు విజయతీరాలకు చేరలేకపోయింది.
గుజరాత్ బౌలర్లు సమష్టిగా సత్తాచాటారు. అజ్మతుల్లా, ఉమేశ్ యాదవ్, జాన్సన్, మోహిత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ఓటమి గురించి హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ తీవ్రంగా చర్చించుకున్నారు. ఇదంతా కెమెరా కంటికి చిక్కింది. రోహిత్ సీరియస్‌గా వివరిస్తుండటంతో వాగ్వాదంలా అనిపించింది. ఇవాళ మ్యాచ్‌లో కెప్టెన్సీ పరంగా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని హార్దిక్‌కు రోహిత్ సీరియస్‌గా సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
పవర్‌ప్లేలో బుమ్రాను ఆలస్యంగా తీసుకురావడం, ముంబై బ్యాటింగ్ ఆర్డర్‌పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అయితే రోహిత్-హార్దిక్ సీరియస్ డిస్కషన్ ముందు.. హిట్‌మ్యాట్‌ను వెనక నుంచి పాండ్య ప్రేమగా హగ్ చేసుకున్నాడు. దీంతో ముంబై జట్టులో అంతర్గత విభేదాలు లేవని సంకేతాలు వస్తున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు.