అభిమానం హద్దులు దాటింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య అభిమానులు వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. ఆదివారం అహ్మదాబాద్ స్టేడియంలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్‌ను కాదని హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం అప్పగించిన విషయం తెలిసిందే.
ఈ నిర్ణయాన్ని రోహిత్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. నెటింట్లో, బయటా హార్దిక్‌ను లక్ష్యంగా చేసుకుని దారుణంగా విమర్శించారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ముంబై యాజమాన్యం వివరించినా హిట్ మ్యాన్ అసంతృప్తి చల్లారలేదు. తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హార్దిక్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు.

టాస్ కోసం హార్దిక్ పాండ్య వచ్చినప్పుడు 'రోహిత్ రోహిత్' అంటూ నినాదాలు చేశారు. రోహిత్ పేరుతో స్టేడియం మార్మోగింది. దీనిపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కూడా ఆశ్చర్యపోయాడు. ఓ భారత క్రికెటర్‌కు ఇలాంటి వ్యతిరేకత మునుపెన్నడూ చూడలేదని పీటర్సన్ అన్నాడు.
అయితే గుజరాత్-ముంబై మ్యాచ్ మధ్యలో రోహిత్, హార్దిక్ అభిమానులు ఘోరంగా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆటగాళ్లపై అభిమానం ఉండాలి కానీ, ఇతరులను గాయపరిచేలా ఉండకూడదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఆరు పరుగుల తేడాతో గెలిచి ఐపీఎల్ 17వ సీజన్‌ను ఘనంగా బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (45; 39 బంతుల్లో), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (31; 22 బంతుల్లో) రాణించారు.
అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేసింది. బ్రెవిస్ (46; 38 బంతుల్లో), రోహిత్ శర్మ (43; 29 బంతుల్లో) పోరాడారు. గుజరాత్ బౌలర్లు సమష్టిగా సత్తాచాటారు. అజ్మతుల్లా, ఉమేశ్ యాదవ్, జాన్సన్, మోహిత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు.