టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రీఎంట్రీ గురించి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ తన ఫిట్‌నెస్ నిరూపించుకునే పరీక్షను ఈ నెల మార్చి 5వ తేదీన ఎదుర్కోనున్నాడని గంగూలీ తెలిపాడు. ఈ టెస్టులో పంత్ కచ్చితంగా పాస్ అవుతాడని పేర్కొన్నాడు. ఫిట్‌నెస్ పరీక్షను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) నిర్వహిస్తుంది.
పంత్ తన ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాత ఢిల్లీ కెప్టెన్సీ , వికెట్ కీపింగ్ బ్యాకప్ గురించి నిర్ణయాలు తీసుకుంటామని గంగూలీ తెలిపాడు. గాయం నుంచి కోలుకున్న అతడిపై పనిభారం విషయంలో జాగ్రత్త వహిస్తామని చెప్పాడు. పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు గంగూలీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

''మార్చి 5న రిషభ్ పంత్ తన ఫిట్‌నెస్ టెస్టులో క్లియర్ అవుతాడు. ఆ తర్వాత ఢిల్లీ కెప్టెన్సీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటాం. అతడి విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటాం. అతడికి సుదీర్ఘ కెరీర్ ఉంది. అతడిని ఉత్సాహంలో నెట్టడానికి ఎట్టిపరిస్థితుల్లో ప్రయత్నించాం. అతడు ఎలా స్పందిస్తున్నాడో ముందుగా చూస్తాం. ఎన్సీఏ అతడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఢిల్లీ క్యాంప్‌లో జాయిన్ అవుతాడు. అతడిని మ్యాచ్ మ్యాచ్‌కు పరిశీలిస్తాం. దేన్ని అంచనా వేయలేం''
''ఇక వికెట్ కీపింగ్ ఆప్షన్లకు వస్తే.. కుమార్ కుషాగ్ర, రికీ భుయ్ ఉన్నారు. వాళ్ల మంచి ఫామ్‌లోనే ఉన్నారు. అంతేగాక షై హోప్, ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఉన్నారు. పంత్ పునరాగమనం జట్టుకు బలోపేతంగా మారుతుంది. అతడు పూర్తి సీజన్ ఆడతాడని ఆశిస్తున్నాం. పంత్ ఎంతో స్పెషల్ ప్లేయర్. ఇక అన్ని ఫార్మాట్లలో సత్తాచాటే దేశవాళీ ఆటగాళ్లపై కూడా దృష్టిపెట్టాం'' అని గంగూలీ పేర్కొన్నాడు.
2022 ఏడాది ఆఖర్లో కారు ప్రమాదానికి గురైన పంత్ ఆ తర్వాత నుంచి ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో పంత్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును డేవిడ్ వార్నర్ నడిపించాడు. గత సీజన్‌లో ఢిల్లీ పేలవ ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగన నుంచి రెండో స్థానంలో నిలిచింది. కాగా, మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది.