ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని తప్పించే యోచనలో బీసీసీఐ ఉందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేగాక తాజాగా భారత టీ20 జట్టులో కోహ్లి స్థానంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో తన స్థానంపై వస్తున్న ప్రశ్నలకు, విమర్శలకు కోహ్లి సమాధానమిచ్చాడు.
వ్యాఖ్యాతలుగా ఉన్న కెవిన్ పీటర్సన్, రవిశాస్త్రి కోహ్లి గురించి చర్చించారు. ''అమెరికాలో ప్రపంచకప్ జరగనుంది. న్యూయార్క్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. అక్కడ క్రికెట్ ప్రమోట్ చేయడానికి కోహ్లి వంటి వ్యక్తి అవసరం'' అని పీటర్సన్ పేర్కొన్నాడు. దానికి రవిశాస్త్రి బదులిస్తూ ''ఆటను ఎదగడానికి కాదు, పోటీలో గెలవడానికి చూడాలి. ఆట ఎదిగాల్సిన సమయంలో అదే జరుగుతుంది. దాని కోసం అనవసర బరువు వద్దు. 2007 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో యువ ప్లేయర్లు ఉన్నారు. యువత కావాలి'' అని పేర్కొన్నాడు.

ఈ విమర్శలకు విరాట్ కోహ్లి పరోక్షంగా బదులిచ్చాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన అనంతరం కోహ్లి మాట్లాడాడు. ''ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్ ఆటను ప్రమోట్ చేయడానికి కేవలం నా పేరు మాత్రమే వాడుతున్నారు. నాకు తెలిసి నాలో ఆట ఇంకా మిగిలే ఉంది'' అంటూ రవిశాస్త్రికి చురకలు అట్టించాడు.
సోమవారం బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ నాలుగు వికెట్లు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (45; 37 బంతుల్లో) టాప్ స్కోరర్. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
విజయంలో విరాట్ కోహ్లి (77; 49 బంతుల్లో) కీలకపాత్ర పోషించాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (28*; 10 బంతుల్లో), మహిపాల్ లోమ్రర్ (17*; 8 బంతుల్లో) దూకుడుగా ఆడి జట్టును గెలిపించారు.