చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 181 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (81; 56 బంతుల్లో, 8×4, 5×6), నికోలస్ పూరన్ (40*; 21 బంతుల్లో, 1×4, 5×6) సత్తాచాటారు.
అనంతరం ఛేదనలో ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. మహిపాల్ లోమ్రర్ (33; 13 బంతుల్లో, 3×4, 3×6), రజత్ పటిదార్ (29; 21 బంతుల్లో, 2×4, 2×6) పోరాడారు. మయాంక్ యాదవ్ (3/14), నవీనుల్ హక్ (2/25) సత్తాచాటారు. విజయంలో కీలకపాత్ర పోషించిన మయాంక్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డు అతడు అందుకోవడం వరుసగా ఇది రెండోసారి. అరంగేట్ర పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లోనూ మయాంక్ అవార్డు అందుకున్నాడు.

అయితే ఈ యంగ్ స్పీడ్‌గన్ గురించే క్రికెట్ ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. 21 ఏళ్ల వయసులో బుల్లెట్ వేగంతో బంతులు విసురుతున్నాడు. పంజాబ్ మ్యాచ్‌లో ఐపీఎల్-2024లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా మయాంక్ రికార్డులకెక్కాడు. నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తన రికార్డును తానే తిరిగరాశాడు. అంతకుమించిన స్పీడ్ విసిరి నయా రికార్డు నెలకొల్పాడు. గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన నాలుగో బంతిని విసిరిన ఆటగాడిగా మయాంక్ నిలిచాడు. తొలి స్థానంలో షాన్ టైట్ (157.7 కి.మీ/గ) ఉన్నాడు.
కాగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న అనంతరం తన స్పీడ్ సక్సెస్ మంత్రాన్ని మయాంక్ చెప్పాడు. ''ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును రెండు సార్లు అందుకోవడం చాలా బాగుంది. మేం రెండు మ్యాచ్‌లు గెలవడం ఇంకా సంతోషంగా ఉంది. అయితే నా లక్ష్యం భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించడం. ఇక ఈ మ్యాచ్‌లో నా ఫేవరేట్ వికెట్ కామెరూన్ గ్రీన్‌ను ఔట్ చేయడం''
''అయితే ఈ వేగంతో బంతులు వేయడంలో చాలా కారకాలు ఉంటాయి. సరైన ఆహారం, మంచి నిద్ర, గొప్ప శిక్షణ. మీరు వేగంగా కచ్చితత్వంతో బంతులు సంధించాలంటే ఇలాంటి కారకాలు చాలా ఉంటాయి. ప్రస్తుతానికి నా డైట్, రికవరీపై ఫోకస్ చేస్తున్నా. ఐస్ బాత్ చేస్తుంటాను'' అని మయాంక్ పేర్కొన్నాడు. ఆర్సీబీ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన మయాంక్ 13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. రజత్ పటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, గ్రీన్‌ను ఔట్ చేశాడు. పటిదార్, మాక్సీ క్యాచ్ ఔటవ్వగా, గ్రీన్ క్లీన్‌బౌల్డయ్యాడు.