రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో పరాజయం. సొంతమైదానంలో వరుసగా మరో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత లక్నో అయిదు వికెట్లకు 181 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (81; 56 బంతుల్లో, 8×4, 5×6), నికోలస్ పూరన్ (40*; 21 బంతుల్లో, 1×4, 5×6) సత్తాచాటారు.
అనంతరం ఛేదనలో ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. మహిపాల్ లోమ్రర్ (33; 13 బంతుల్లో, 3×4, 3×6), రజత్ పటిదార్ (29; 21 బంతుల్లో, 2×4, 2×6) పోరాడారు. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి (22; 16 బంతుల్లో 2×4, 1×6), డుప్లెసిస్ (19; 13 బంతుల్లో, 3×4), మాక్స్‌వెల్ (డకౌట్, 2 బంతుల్లో), కామెరూన్ గ్రీన్ (9; 9 బంతుల్లో, 1×4) నిరాశపరిచారు.

అయితే ఈ మ్యాచ్ గురించి మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మనోజ్ తివారీ చర్చించారు. ఆర్సీబీ ఓటమికి గల కారణాలు విశ్లేషించారు. మనోజ్ తివారీ మాట్లాడుతూ.. ''182 పరుగుల టార్గెట్‌ను ఆర్సీబీ ఛేదించగలదు. కానీ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఏబీ డివిలియర్స్ గైర్హాజరీ వాళ్లని దెబ్బతీసి ఉంటుంది. అయితే ఎమర్జింగ్ ప్లేయర్, ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా ప్రధాన ప్లేయర్ అయిన కామెరూన్ గ్రీన్ సత్తాచాటాల్సింది''
''కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన గ్రీన్ (33; 21 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. కానీ ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో రజత్ పటిదార్ వచ్చాడు. గ్రీన్‌కు బదులుగా పటిదార్‌ను పంపించారు. మరోవైపు మాక్స్‌వెల్ ఫ్లాప్ అవుతున్నాడు. మాక్సీ ఐపీఎల్ గణాంకాలను ఓ సారి చూడండి. అతడు చాలా మంచి ప్లేయర్. ఆడిన 14 మ్యాచ్‌ల్లో మాక్సీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలని అనట్లేదు. కానీ కనీసం 7 నుంచి 8 మ్యాచ్‌ల్లో అయినా జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడాలి కదా!'' అని మనోజ్ తివారీ అన్నాడు.
దీనికి సెహ్వాగ్ బదులిచ్చాడు. ''7-8 మ్యాచ్‌లా? విరాట్ కోహ్లికి కూడా 7-8 మ్యాచ్‌లు గెలిపించడం అసాధ్యం. ఏ జట్టు అయినా తమ అత్యధిక ధర ఆటగాడు 2-3 మ్యాచ్‌లు గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడితే చాలనుకుంటారు. అసలు ఆ రెండు మూడు మ్యాచ్‌లను గెలిపించినా గొప్పగా ఫీల్ అవ్వొచ్చు. ఓ ఏడాదిలో 7-8 మ్యాచ్‌లను గెలిపించవచ్చు కానీ, ఓ ఐపీఎల్ సీజన్‌లో కాదు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ ప్లేయర్ తమ జట్టును ఓ సీజన్‌లో ఏడు - ఎనిమిది సార్లు గెలిపించడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు'' అని సెహ్వాగ్ తెలిపాడు.