IPL RCB vs KKR: ఐపీఎల్ 2024 సీజన్ 17వ ఎడిషన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తన మూడో మ్యాచ్ ఆడబోతోంది. హోమ్ పిచ్‌పై కోల్‌కత నైట్ రైడర్స్‌తో తలపడనుంది. సాయంత్రం 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ మొదలవుతుంది.
కోల్‌కత నైట్ రైడర్స్‌కు ఇది సెకెండ్ గేమ్. ఈ రెండు జట్లు కూడా ఒక్కో మ్యాచ్ గెలిచాయి ఇప్పటివరకు. రెండు పాయింట్లను సాధించాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది కోల్‌కత. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశాలు ఉన్నాయి.

గత ట్రాక్ రికార్డ్ తిరగేస్తే- నైట్ రైడర్స్ గెలవడానికే ఛాన్సెస్ ఉన్నాయి. బెంగళూరులో ఆర్సీబీతో ఆడిన చివరి అయిదు మ్యాచ్‌లల్లో కోల్‌కతదే పైచేయి. 2016, 2017, 2018, 2019, 2023 సీజన్లల్లో సొంత స్టేడియంలో ఆర్సీబీని ఓడిస్తూ వస్తోంది. 2015లో చివరిసారిగా బెంగళూరులో ఆర్సీబీ చేతిలో ఓడింది కోల్‌కత. అప్పటి నుంచి గత సీజన్ వరకూ అన్నీ విజయాలే.
కాగా- ఈ మ్యాచ్ కేకేఆర్ స్టార్ స్పిన్ బౌలర్ సునీల్ నరైన్‌కు చిరస్మరణీయంగా మారబోతోంది. ఇది- అతను ఆడబోయే 500 టీ20 మ్యాచ్. ఇప్పటివరకు 499 మ్యాచ్‌లను ఆడాడు సునీల్. ఐపీఎల్‌లో 163వది. 2012 నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడుతూ వస్తోన్నాడు.
అంతకంటే ముందే అతని టీ20 కేరీర్ మొదలైంది. 2011లో టీ20ల్లో అడుగు పెట్టాడు. 499 మ్యాచ్‌లను ఆడాడు. 536 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు 500 టీ20 మ్యాచ్‌లను ఆడిన ప్లేయర్లు ఇద్దరే. డ్వేన్ బ్రావో, షోయబ్ మాలిక్ మాత్రమే ఈ మార్క్‌ను అందుకున్నారు. బ్రావో- 573, షోయబ్ మాలిక్- 542 మ్యాచ్‌లను ఆడారు.
టీ20ల్లో 500లకు పైగా వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్ కూడా సునీల్ నరైనే. అతనికంటే ముందు బ్రావో- 625, రషీద్ ఖాన్- 566, ఇమ్రాన్ తాహిర్- 502 వికెట్లు తీసుకున్నారు. టీ20ల్లో షేన్ వాట్సన్, రోహిత్ శర్మను అత్యధిక సార్లు అవుట్ చేసిన రికార్డు కూడా అతని పేరు మీదే ఉంది. వారిద్దరినీ పదేసి సార్లు అవుట్ చేశాడు.
టీ20ల్లో మ్యాన్ ఆఫ్ ది మెయిడెన్ ఓవర్స్‌గా గుర్తింపు ఉంది సునీల్‌కు. బౌలర్లకు పీడకలగా భావించే ఈ టీ20 ఫార్మట్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్ ఓవర్లు సంధించడం అంటే అసాధారణ విషయం. అలాంటిది ఇప్పటివరకు 30 మెయిడెన్ ఓవర్లు వేశాడీ వెస్టిండీస్ స్టార్ బౌలర్. సునీల్ నరైన్ బౌలింగ్‌లోనే ఎంఎస్ ధోనీ కేరీర్‌లోనే లోయెస్ట్ స్ట్రైక్ రేట్ నమోదు చేయడం అతని సత్తాకు నిదర్శనం.