Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని చవి చూసింది. ఇప్పటివరకు ఆడిన మూడింట్లో రెండు ఓడిపోయిన మ్యాచ్‌లే ఉన్నాయి. తన సొంత గడ్డపై 182 పరుగుల భారీ స్కోర్‌ను చేసినా గానీ దాన్ని కాపాడుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దిగజారింది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో మట్టికరిచింది ఆర్సీబీ. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ- నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్- 8, రజత్ పటిదార్- 3, అనూజ్ రావత్- 3 విఫలం అయ్యారు. కామెరాన్ గ్రీన్- 33, మ్యాక్స్‌వెల్- 28 ఫర్వాలేదనిపించారు.

ఇంత భారీ స్కోర్‌ను ఇంకా 19 బంతులు మిగిలివుండగానే కొట్టి అవతలపడేసింది కోల్‌కత నైట్ రైడర్స్ టీమ్. ఈ క్రమంలో మూడు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్- 30, సునీల్ నరైన్: 47, వెంకటేష్ అయ్యర్- 50 పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్- 47, రింకూ సింగ్- 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
ఆర్సీబీ ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బౌలర్లు. నాసిరకం బౌలింగ్ చేశారు పైగా తమ సొంత గడ్డపై. హోమ్ పిచ్‌పై చేయదగ్గ బౌలింగ్ కాదది. ఒక్కరు కూడా కోల్‌కత బ్యాటర్లను భయపెట్టలేకపోయారు. వారిని ఒత్తిడిలోకి నెట్టలేకపోయారు. ఒక్క విజయ్‌కుమార్ వైశాఖ్ మాత్రమే నైట్ రైడర్లను అదుపులో ఉంచగలిగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
ఐపీఎల్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మహ్మద్ సిరాజ్.. ఈ మ్యాచ్‌లో కూడా తేలిపోయాడు. ధారాళంగా పరుగులను సమర్పించుకున్నాడు. మూడు ఓవర్లల్లో ఏకంగా 46 పరుగులను పిండుకున్నారు నైట్ రైడర్స్ బ్యాటర్లు. ఇందులో ఒక ఫోర్, అయిదు సిక్సులు ఉన్నాయి. సిరాజ్ బౌలింగ్‌లోనే అత్యధికంగా అయిదు సిక్సులు కొట్టారు బ్యాటర్లు.
అల్జారీ జోసెఫ్, యాష్ దయాళ్.. ఘోరంగా విఫలం అయ్యారు. జోసెఫ్ ఇచ్చిన పరుగులు 34. అదికూడా రెండంటే రెండు ఓవర్లల్లోనే. మహ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్ ఇద్దరూ కలిసి అయిదు ఓవర్లల్లో 80 పరుగులు ఇచ్చుకున్నారంటే వారి బౌలింగ్ నాణ్యత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. యాష్ పరిస్థితీ అంతే. నాలుగు ఓవర్లల్లో 46 పరుగులు ఇచ్చినా కంటి తుడుపుగా ఓ వికెట్ పడగొట్టాడు.