వచ్చే ఏడాది ఐపీఎల్ హీట్ ఇప్పటి నుంచే మొదలైంది. డిసెంబరు 19న ఐపీఎల్ మినీ వేలం ఉన్న నేపథ్యంలో.. అన్ని జట్ల రిటెన్షన్లపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఆదివారం నాటితో రిలీజులు, రిటెన్షన్ల గడువు ముగిసింది. దీంతో అన్ని జట్లు తాము రిలీజ్ చేయాల్సిన ప్లేయర్లపై ఒక క్లారిటీకి వచ్చేశాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా తమ జట్టులో కొందరు ప్లేయర్లను రిలీజ్ చేసేసింది.
ఈ ఏడాది ఫ్రాంచైజీల పర్సు వాల్యూను రూ.100 కోట్లకు ఐపీఎల్ యాజమాన్యం పెంచింది. అంతేకాదు, దుబాయ్‌లోని కోకా కోలా ఎరీనాలో ఐపీఎల్ మినీ వేలం నిర్వహించనున్నారు. ఇంతకాలం ఐపీఎల్ వేలం కేవలం భారత్‌లోనే జరిగింది. కానీ ఇప్పుడు తొలిసారి విదేశాల్లో ఈ వేలం నిర్వహిస్తున్నారు. అంతేకాదు, ఇదే చివరి మినీ వేలం కూడా. ఎందుకంటే వచ్చే ఏడాది మెగావేలం జరగనుంది.

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్, విండీస్ ఆల్‌రౌండర్ ఓబెడ్ మెకాయ్, జేసన్ హోల్డర్‌ను రాజస్థాన్ ఫ్రాంచైజీ వదిలేసింది. అలాగే అబ్దుల్ బసిత్, కుల్దీప్ యాదవ్, మురుగన్ అశ్విన్, కేసీ కరియప్ప, కేఎం ఆసిఫ్, ఆకాష్ వశిష్ట్‌ను కూడా రాజస్థాన్ రిలీజ్ చేసేసింది. వీళ్లందరూ కూడా మినీ వేలంలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.
ఇక రిటైన్ చేసుకున్న ప్లేయర్ల వివరాలకొస్తే.. కెప్టెన్ సంజూ శాంసన్‌ను రిటైన్ చేసుకుంది. అలాగే ఫామ్ లేక తంటాలు పడుతున్న ఓపెనర్ జోస్ బట్లర్‌పై ఫ్రాంచైజీ నమ్మకం ఉంచింది. రవిచంద్రన్ అశ్విన్‌ను కూడా రిటైన్ చేసింది.
రిటైన్ చేసుకున్న ప్లేయర్లు: సంజూ శాంసన్, జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జంపా