జైపుర్ వేదికగా జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌ను రాజస్థాన్ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే వాళ్లంతా క్రికెట్‌పై అభిమానంతో కాదు. రాజస్థాన్ ఫ్రాంచైజీ ప్రకటించిన 'పింక్ ప్రామీస్' ఆఫర్ కోసం!
పింక్ ప్రామీస్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రాష్ట్ర ప్రజలకు రెండు ఆఫర్లు అందించనుంది. మహిళల సాధికారిత, అభ్యున్నత లక్ష్యంగా.. ఇవాళ మ్యాచ్‌కు అమ్ముడైన ప్రతి టికెట్‌పై రూ.100ను రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్‌కు ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని మహిళల కోసం ఖర్చు చేయనున్నారు.

అంతేగాక ఇవాళ మ్యాచ్‌లో నమోదైన ప్రతి సిక్సర్‌కు ఆరు ఇళ్లకు చొప్పున ఫ్రీ సోలార్ పవర్ కనెక్షన్ ఇవ్వనుంది.
తొలుత రాజస్థాన్‌లోని సాంబర్ ప్రాంతంలోని ఇళ్లకు ఉచితంగా సోలార్ ఫ్యానెల్‌ను అందించనుంది. అందుకే రాజస్థాన్ రాష్ట్ర ప్రజలు ఈ మ్యాచ్‌ను ఎంతో ఆసక్తితో వీక్షిస్తున్నారు. ఎక్కువ సిక్సర్లు నమోదుకావాలని కోరుకుంటున్నారు.
కాగా, టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తమ తుది జట్టులో ఎలాంటి మార్పులేదని, గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని శాంసన్ పేర్కొన్నాడు. మరోవైపు ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ తమ జట్టులో ఓ మార్పు జరిగిందని తెలిపాడు. అనుజ్ రావత్ స్థానంలో సౌరవ్ చౌహన్ జట్టులోకి వచ్చాడని వెల్లిడించాడు. ఇటీవల జరిగిన వేలంలో చౌహన్‌ను ఆర్సీబీ రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది.
తుదిజట్టు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, సౌరవ్ చౌహన్, దినేశ్ కార్తీక్, మయాంక్ దాగర్, రీస్ టోప్లే, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
రాజస్థాన్ రాయల్స్: బట్లర్, యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, నాంద్రె బర్గర్, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్.