ఐపీఎల్ 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ఇంకా నాలుగైదు నెలలు ఉండగానే.. ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్ కూడా ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 10 జట్లు ఈ మెగా ఈవెంట్‌లో పోరాడనున్నాయి.
రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీనికోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. కొన్ని ఫ్రాంఛైజీల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. మొన్నటికి మొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో హెడ్ కోచ్‌కు స్థానచలనం కలిగింది.

జింబాబ్వేకు చెందిన లెజెండరీ బ్యాటర్ ఆండీ ఫ్లవర్‌ను కొత్త హెడ్ కోచ్‌గా ప్రకటించింది. హెడ్ కోచ్ సంజయ్ బంగర్ స్థానంలో అతన్ని అపాయింట్ చేసుకుంది ఆర్సీబీ. ఫ్రాంఛైజీ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్, సంజయ్ బంగర్ కాంట్రాక్టులను పునరుద్ధరించలేదు. వారిద్దరి స్థానంలో ఆండీ ఫ్లవర్‌ను తీసుకుంది.
ఇప్పుడు అలాంటి పరిణామాలే రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీల్లో చోటు చేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ లెజెండరీ బౌలర్ షేన్ బాండ్ అపాయింట్ అయ్యాడు. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది.
షేన్ బాండ్ సుదీర్ఘకాలం పాటు ముంబై ఫ్రాంఛైజీలో కొనసాగాడు. తొమ్మిది సంవత్సరాల పాటు అతను సేవలను అందించాడు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ముంబై ఇండియన్స్‌ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు షేన్ బాండ్. ఇప్పుడా ఫ్రాంఛైజీని వదిలేశాడు. షేన్ బాండ్ స్థానంలో శ్రీలంక లెజెండరీ ప్లేయర్ లసిత్ మలింగతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది ముంబై.