ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పట్టిందల్లా బంగారంగా మారుతోంది. గత కొన్నాళ్లుగా వరుస విజయాలతో హోరెత్తిస్తూ అత్తుతమ సారథిగా నిలుస్తున్నాడు. 2023 నుంచి ఆస్ట్రేలియాను ఎదురులేని స్థితిలో నిలుపుతున్నాడు. ఇటీవల జరిగిన వెస్టిండీస్ టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేయడం మినహా మిగిలిన అన్ని టెస్టు సిరీస్‌ల్లో కంగారూలదే పైచేయి.
ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌ను కంగుతినిపించి యాషెష్ సిరీస్‌ను కమిన్స్ కాపాడుకున్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి సుదీర్ఘ ఫార్మాట్ జగజ్జేతగా ఆసీస్‌ను నిలబెట్టాడు. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌ను వాళ్ల దేశానికి అందించాడు. ఈ మెగాటోర్నీ తుదిపోరులోనూ టీమిండియాపైనే గెలిచి ట్రోఫీని అందుకున్నాడు.

స్టేడియంలో ఉన్న లక్ష మంది భారత అభిమానులను సైలెంట్‌గా ఉంచుతానని కమిన్స్ శపథం చేసి మరీ అన్నంత పని చేశాడు. ఈ వ్యాఖ్యలు అతిగా చేసినట్లుగా అనిపించినా తనపై తనకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. ఆ తర్వాత స్వదేశంలో పాకిస్థాన్‌ను వణికించాడు. తాజాగా న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌ను 2-0తో ఓడించాడు.
ఈ నేపథ్యంలో కమిన్స్ సామర్థ్యం, అదృష్టం గురించి చర్చలు మొదలయ్యాయి. ఫాస్ట్ బౌలర్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ కమిన్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాకుండా కెప్టెన్‌గా జట్టులో ఉన్న వనరులును గొప్పగా ఉపయోగించుకుంటున్నాడు. అందుకే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ జట్టు బాధ్యతలను కమిన్స్ అప్పగించింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మార్క్‌రమ్ సన్‌రైజర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టినప్పటికీ కమిన్స్ ఫామ్‌ను చూసి యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
కమిన్స్ అదే జోరును కొనసాగించి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టైటిల్ సాధిస్తాడని యాజమాన్యం నమ్మకం పెట్టుకుంది. అయితే ఆస్ట్రేలియా జట్టులో ఉన్న మ్యాచ్ విన్నర్లతో కమిన్స్ ఈ విజయాలు సాధిస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో పాటు కమిన్స్‌కు కాస్త అదృష్టం కూడా కలిసొస్తుందని మరికొందరు అంటున్నారు. మరి అదే మ్యాజిక్‌ను కమిన్స్ ఐపీఎల్-2024లో చూపిస్తాడో లేదో చూడాలి. సన్‌రైజర్స్‌కు టైటిల్ సాధించిపెడితే కమిన్స్ నక్కతోక తొక్కినట్లే. గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ టేబుల్‌లో అట్టడుగన నిలిచిన సంగతి తెలిసిందే.