రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. అదేంటి? చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోతే బాధపడాలి కానీ సంతోషం ఏంటని అనుకుంటున్నారా? ఓడిపోయినందుకు ఆర్సీబీ ఫ్యాన్స్ శుక్రవారం నిరాశే చెందారు. కానీ శనివారం చిందేస్తున్నారు. వేలానికి ముందు తమ ఆర్సీబీ మాజీ ఆటగాడు హర్షల్ పటేల్ వదులుకున్నందుకు ఇవాళ తెగ సంబరపడుతున్నారు.
దానికి కారణం.. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో హర్షల్ పటేల్ దారుణమైన ప్రదర్శన. వేలానికి ముందు హర్షల్ పటేల్‌ను విడిచిపెట్టినందుకు ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. డెత్ ఓవర్లలో కాస్త సమర్థవంతంగా బౌలింగ్ చేసే జట్టులో ఉన్న ఏకైక ఆటగాడిని వదులుకోవడం ఏంటని ప్రశ్నలు తలెత్తాయి.

ఆ తర్వాత హర్షల్ పటేల్ వేలానికి వచ్చాడు. 2024 సీజన్‌కు నిర్వహించిన వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న భారత ఆటగాడిగా హర్షల్ నిలిచాడు. అతని కోసం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ విపరీతంగా పోటీపడింది. అంతిమంగా రూ.11.75 కోట్లకు దక్కించుకుంది. కాగా, ఇవాళ ఢిల్లీతో ఆడుతున్న మ్యాచ్‌లో హర్షల్ నాలుగు ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకున్నాడు.
20వ ఓవర్ వేసిన హర్షల్ ఏకంగా 25 పరుగులు ఇచ్చాడు. హర్షల్ బౌలింగ్‌లో కుర్రాడు అభిషేక్ పోరెల్ రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదాడు. అంతేగాక అంతకుముందు ఫీల్డింగ్‌లోనూ హర్షల్ నిరాశపరిచాడు. పంత్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచి ప్రత్యర్థికి బౌండరీని కానుకగా ఇచ్చాడు. అయితే సూర్యుడి ఎఫెక్ట్‌తో బాల్ కనిపించలేదని హర్షల్ కారణాలు చెప్పాడు. కానీ ఆ సమయంలో అతడు క్వాలిటీ కూలింగ్ గ్లాసెస్ ధరించడం గమనార్హం. గ్లాసెస్ పెట్టుకున్నప్పటికీ బాల్ కనిపించలేదని హర్షల్ చెప్పిన రీజన్‌కు కామెంటరీలో ఉన్న వ్యాఖ్యాతలు కూడా ఆశ్చర్యపోయారు.
ఈ నేపథ్యంలో హర్షల్ పటేల్‌ను టార్గెట్ చేస్తూ నెట్టింట్లో ట్రోల్స్ మొదలయ్యాయి. హర్షల్ పటేల్‌ను విడిచిపెట్టకపోతే ఆర్సీబీ పరిస్థితి దారుణంగా ఉండేదని కామెంట్లు చేస్తున్నారు. ఆర్సీబీని వదిలినా బెంగళూరు బౌలింగ్ స్టైల్‌ను హర్షల్ వదల్లేదని మరికొందరు ఫన్నీగా పోస్ట్‌లు పెడుతున్నారు.