ఐపీఎల్-2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇంకా బోణీ కొట్టలేదు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. సొంతమైదానంలో అయినా MI విజయం సాధిస్తుందనుకుంటే ముంబై అభిమానులకు పూర్తిగా నిరాశే మిగిలింది. వాఖండే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్‌లో హోమ్‌గ్రౌండ్‌లో ఓడిన రెండో జట్టుగా ఆర్సీబీ సరసన ముంబై నిలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 125 పరుగులు చేసింది. చాహల్ (3/11), బౌల్ట్ (3/22), బర్గర్ (2/32) బంతితో చెలరేగడంతో ముంబై బ్యాటర్లు బ్యాట్లెత్తేశారు. బౌల్ట్ ధాటికి రోహిత్ శర్మ, నమన్, బ్రెవిస్ గోల్డెన్ డక్ అయ్యారు. మరోవైపు ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 15.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. రియాన్ పరాగ్ (54*; 39 బంతుల్లో) తన ఫామ్‌ను కొనసాగిస్తూ మరో అర్ధశతకం సాధించాడు.

ఛేజింగ్‌కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. మఫాక తొలి ఓవర్‌లోనే జైస్వాల్ (10; 6 బంతుల్లో) ఔట్ చేశాడు. అయితే నాలుగో ఓవర్‌లో రాజస్థాన్ మరో వికెట్ కోల్పోవాల్సి ఉంది. కానీ హార్దిక్ పాండ్య క్యాచ్‌ను జారవిడిచాడు. బుమ్రా వేసిన బంతిని బట్లర్ మిడాఫ్ మీదుగా షాట్‌కు యత్నించాడు. హార్దిక్ ఎడమవైపు జరిగి క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ బంతిని హార్దిక్ నియంత్రించలేక జారవిడిచాడు.
ఛేదన ప్రారంభంలో మరో వికెట్ కోల్పోతే రాజస్థాన్ ఒత్తిడిలోకి వెళ్లేది. ముంబై తిరిగి పోటీలోకి వచ్చేది. దీంతో కీలక సమయంలో హార్దిక్ క్యాచ్‌ను మిస్ చేయడంలో ముంబై డగౌట్‌లో ఉన్న ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది నిరాశచెందారు. మరోవైపు క్యాచ్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన హార్దిక్‌కు రోహిత్ శర్మ మద్దతుగా నిలిచాడు. గొప్ప ప్రయత్నం అంటూ క్లాప్స్‌తో ప్రోత్సహించాడు. హిట్‌మ్యాన్ రియాక్షన్‌తో రోహిత్-హార్దిక్ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టమవుతోందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ట్రేడ్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వచ్చిన హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే.