Rohit Sharma: ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు గాడినపడినట్టే కనిపిస్తోంది. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. ఈ సీజన్‌లో ముంబైకి వరుసగా ఇది రెండో గెలుపు. ఇదివరకు ఢిల్లీ కేపిటల్స్‌పై బోణీ చేసిందా జట్టు.
గురువారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌పై ఏడు వికెట్ల తేడాతో తిరగులేని విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. దాన్ని అలవోకగా కొట్టిపడేశారు ముంబై బ్యాటర్లు.

ఇంకా 27 బంతులు మిగిలివుండగానే.. ఏడు వికెట్లు చేతిలో ఉండగానే 196 పరుగుల టార్గెట్‌ను కొట్టారంటే వారి దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ ఇషాన్ కిషన్- 69, ఇంపాక్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్- 52 భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. 34 బంతుల్లో అయిదు సిక్సర్లు, ఏడు ఫోర్లతో ఇషాన్ కిషన 69, 19 బంతుల్లో నాలుగు సిక్సర్లు, అయిదు ఫోర్లతో సూర్యకుమార్ 52 పరుగులు చేశారు.
మరో ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన స్టైల్‌లో మెరుపులు మెరిపించాడు. 24 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 38 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో రీస్ టోప్లేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఎవరూ దాన్ని బ్రేక్ చేయకపోవచ్చు.
వాంఖెడే స్టేడియంలో 100 సిక్సర్లను కొట్టిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ ఒక్కడే. ఇప్పటివరకు ఎవ్వరూ కూడా దీన్ని అందుకోలేదు.. అందుకోనూలేరు. ఒకే స్టేడియంలో టీ20 మ్యాచ్‌లల్లో 100 సిక్సర్లు కొట్టిన ప్లేయర్ మరొకరు ఎవరూ లేరు. అలాంటి అరుదైన రికార్డును రోహిత్ శర్మ తన పేరు మీద లిఖించుకున్నాడు.