Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్ కుదేల్ అవుతోంది. తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించట్లేదీ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లన్నింట్లోనూ చతికిలపడుతూ వస్తోంది. ఫలితంగా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలను చేతులారా మట్టిపాలు చేసుకుంది.
ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లల్లో ఓడినవే ఎక్కువ. మూడింట్లో గెలిచింది. ఎనిమిది మ్యాచ్‌లల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఉన్నవి ఆరు పాయింట్లే. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆ జట్టుకు ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు జీరో.

తాజాగా కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాభవమే ఎదురైంది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టీమ్‌కు. శుక్రవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 19.5 ఓవర్లల్లో 169 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ స్కోర్‌ను ఛేజ్ చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయింది ముంబై ఇండియన్స్. 18.5 ఓవర్లల్లో 145 పరుగులకు చాప చుట్టేసింది.టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే టాప్ స్కోరర్. 35 బంతుల్లో 56 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ కొంత వరకు నిప్పులు చెరుగుతున్న కేకేఆర్ బౌలర్లను ప్రతిఘటించగలిగాడు.
మిగిలిన బ్యాటర్లందరూ దారుణంగా విఫలం అయ్యారు. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో అత్యంత నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. ఇషాన్ కిషన్- 13, రోహిత్ శర్మ- 11, నమన్ ధీర్- 11, తిలక్ వర్మ-4, హార్దిక్ పాండ్యా-1, గెరాల్డ్ కొయెట్జీ- 8, పీయూష్ చావ్లా-0, జస్‌ప్రీత్ బుమ్రా-1 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలు మూసుకుపోయినట్టే.
ఈ ఓటమిపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కథ ఫినిష్ అయిపోయిందని అన్నాడు. కాగితం మీద మాత్రమే బలమైన లైనప్ కలిగినట్టు కనిపించిందని, ఫీల్డ్‌లో దిగాక దాని సత్తా ఏమిటో స్పష్టమైందని వ్యాఖ్యానించాడు.

హార్దిక్ పాండ్యా కేప్టెన్సీని ఇర్ఫాన్ పఠాన్ వేలెత్తి చూపాడు. 57 పరుగుల వద్ద అయిదు వికెట్లను కేకేఆర్ కోల్పోయినప్పుడు బౌలర్లను మార్చి అతి పెద్ద తప్పు చేశాడని పేర్కొన్నాడు. నమన్ ధీర్‌ను బౌలింగ్‌కు దించడం.. మనీష్ పాండే, వెంకటేష్ అయ్యర్ క్రీజ్‌లో కుదురుకోవడానికి వీలు కలిగించినట్టయిందని అన్నాడు.
క్రికెట్‌లో కెప్టెన్ రోల్ అత్యంత ముఖ్యమైనదని పఠాన్ చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ ప్లేయర్లు.. కెప్టెన్సీ మార్పును అంగీకరించట్లేదనే విషయం ఈ వరుస ఓటములతో స్పష్టమైందని వ్యాఖ్యానించాడు. ఒక టీమ్‌గా యూనిట్‌గా ఆడటం లేదని, జట్టులో విభేదాలు, గ్రూపులు ఉన్నాయనడానికి దీన్ని సూచికగా భావించవచ్చని అభిప్రాయపడ్డాడు.
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందని తాను అనుకోవట్లేదని ఇర్ఫాన్ పఠాన్ తేల్చి చెప్పాడు. బయట కనిపిస్తోన్నంతగా ఐక్యత ఆ జట్టు సభ్యుల్లో ఉండట్లేదని, ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు, గ్రూపులు ఉన్నాయని భావిస్తున్నట్లు వివరించాడు.