Suryakumar Yadav: ఐపీఎల్ 2024 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ముగిశాయి. నేడు ముంబై వాంఖెడే స్టేడియంలో మరో కీలక మ్యాచ్ షెడ్యూల్ అయింది. వరుస పరాజయాలను ఎదుర్కొంటోన్న ముంబై ఇండియన్స్.. తన నాలుగో మ్యాచ్ ఆడబోతోంది. ఢిల్లీ కేపిటల్స్‌తో తలపడనుంది.
ఇది 20వ మ్యాచ్. ఇన్ని గేమ్‌లు ముగిసిన తరువాత కూడా ఇంకా బోణీ కొట్టని జట్టు ఏదయినా ఉందంటే.. అది ముంబై ఇండియన్సే. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదా జట్టు. ఆడిన మూడు మ్యాచ్‌లల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. ఒక్క పాయింట్ కూడా తన ఖాతాలో జమ చేసుకోలేకపోయింది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో అట్టడుగున అంటే 10వ స్థానంలో నిలిచింది.

నేడు తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది హార్దిక్ సేన. రిషభ్ పంత్ సారథ్యాన్ని వహిస్తోన్న ఢిల్లీ కేపిటల్స్‌ను ఢీకొట్టబోతోంది. తన హోమ్ పిచ్ వాంఖెడే స్టేడియంలో షెడ్యూల్ అయిన గేమ్ ఇది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆరంభమౌతుంది. ముంబై ఇండియన్స్‌కు లైఫ్ అండ్ డెత్ గేమ్ ఇది.
తన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో మట్టికరిచింది ముంబై. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ దెబ్బకు ఠారెత్తించింది. 277 పరుగులు రికార్డ్ స్కోర్‌ను ఛేదించలేకపోయింది హార్దక్ టీమ్. మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఇంకా దారుణంగా ఆడిందీ టీమ్. తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లల్లో 129 పరుగులే చేయగలిగింది.
ఈ పరిస్థితుల్లో- టాప్ ఆర్డర్ డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. మ్యాచ్ ఆడబోతోన్నాడు. గాయం కారణంగా ఇన్నాళ్లూ సూర్యకుమార్ యాదవ్ క్రికెట్‌కు దూరంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. జాతీయ జట్టు తరఫున కూడా అతను కొంతకాలంగా ఆడట్లేదు.
వరుస ఓటములతో కుదేల్ అయిన ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్.. ఆపద్బాంధవుడిలా మారతాడా? లేదా? అనేది ఈ సాయంత్రానికి తేలిపోతుంది. ఐపీఎల్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది సూర్యా భాయ్‌కు. ఇప్పటివరకు 139 మ్యాచ్‌లు ఆడాడు. 3,249 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 143.32.
గత సీజన్‌లోనే సూర్యకుమార్ యాదవ్ అత్యధికంగా 605 పరుగులు చేశాడు. ఇప్పటివరకు అతను ఆడిన అన్ని ఐపీఎల్‌లతో పోల్చుకుంటే ఇదే హయ్యెస్ట్ స్కోర్. ఆ ఏకైక సెంచరీ చేసింది కూడా ఆ సీజన్‌లోనే. అదే ఫామ్‌ను ఇప్పుడు కూడా కొనసాగించాలని కోరుకుంటోంది ముంబై ఫ్రాంఛైజీ..