వాంఖడేలో పరుగుల వరద పారింది. ఆఖర్లో షెఫార్డ్ (39*; 10 బంతుల్లో) విధ్వంసం సృష్టించాడు. నోకియా వేసిన 20వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. అతనికి తోడుగా టిమ్ డేవిడ్ (45*; 21 బంతుల్లో) కూడా చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముంబై ఇండియన్స్ 235 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 234 పరుగలు చేసింది. ముంబైకి శుభారంభం దక్కింది. రోహిత్ శర్మ (49; 27 బంతుల్లో, 6x4, 3x6), ఇషాన్ కిషన్ (42; 23 బంతుల్లో, 4x4, 2x6) తొలి వికెట్‌కు ఏడు ఓవర్లలో 80 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆది నుంచే వీరిద్దరు దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ముంబై పవర్‌ప్లేలో ఏకంగా 75 పరుగులు సాధించింది.

అయితే అర్ధశతకం దిశగా సాగుతున్న రోహిత్ శర్మను అక్షర్ పటేల్ చక్కని బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీలో నిరాశపరిచాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతికే డకౌటయ్యాడు. నోకియా బౌలింగ్ షాట్‌కు యత్నించి జేక్ ఫ్రేజర్ చేతికి చిక్కాడు. స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయినా ఇషాన్ దూకుడుగానే పరుగులు సాధించాడు.
కానీ ముంబైను అక్షర్ పటేల్ మరోసారి దెబ్బకొట్టాడు. ఇషాన్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను ఒంటి చేత్తో అక్షర్ గొప్పగా అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ (6; 5 బంతుల్లో) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై 80/0 నుంచి 121/4కు పరిమితమైంది. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన టిమ్ డేవిడ్‌తో కలిసి హార్దిక్ పాండ్య (39; 33 బంతుల్లో, 3x4, 1x6) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడానికి ప్రయత్నించాడు.
హార్దిక్, డేవిడ్ తొలుత కుదురుకోవడానికి ప్రయత్నించారు. బంతికో పరుగు చొప్పున బ్యాటింగ్ చేశారు. కానీ ఆఖర్లో విజృంభించారు. డేవిడ్ ఎడాపెడా బౌండరీ, సిక్సర్లతో హెరెత్తించాడు. హార్దిక్ ఔటైనప్పటికీ డేవిడ్ విధ్వంసం కొనసాగించాడు. అతని ధాటికి ఖలీల్ అహ్మద్ వేసిన 17వ ఓవర్‌లో 17 పరుగులు, నోకియా వేసిన 18వ ఓవర్‌లో16 పరుగులు, ఇషాంత్ శర్మ వేసిన 19వ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. నోకియా వేసిన ఆఖరి ఓవర్‌లో ఫెఫార్డ్ చెలరేగాడు. రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది ఆ ఓవర్‌లో 32 పరుగులు సాధించాడు.