హ్యాట్రిక్ ఓటములతో ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు విజయాలు సాధించి ఏడో స్థానానికి ఎగబాకింది. వాంఖడే వేదికగా నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 197 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఛేదించి నెట్‌రన్‌రేటును కూడా మెరుగుపర్చుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. డుప్లెసిస్ (61; 40 బంతుల్లో, 4x4, 3x6), దినేశ్ కార్తీక్ (53*; 23 బంతుల్లో, 5x4, 4x6), రజత్ పటిదార్ (50; 26 బంతుల్లో,3x4, 4x6) అర్ధశతకాలతో సత్తాచాటారు. బుమ్రా అయిదు వికెట్లతో చెలరేగాడు. నాలుగు ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి కీలక వికెట్లు పడగొట్టాడు.

అనంతరం ముంబై ఇండియన్స్ 15.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్ కిషన్ (68; 34 బంతుల్లో, 7x4, 5x6), సూర్యకుమార్ యాదవ్ (52; 19 బంతుల్లో, 5x4, 4x6) విజృంభించారు. హార్దిక్ పాండ్య (51; 6 బంతుల్లో, 3x6) ఆకట్టుకున్నాడు. అయితే మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లి కనిపించడం, అంతేగాక ముంబై ఫ్రాంచైజీ సహయజమాని నీతా అంబానీతో కోహ్లి ప్రత్యేకంగా చర్చించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శర్మతో కోహ్లి చాలా సేపు మాట్లాడాడు. అయితే వారిద్దరు సీరియస్‌గా మాట్లాడుకున్నట్లు వీడియోలో కనిపించింది. మరోవైపు నీతా అంబానీతో కోహ్లి తీవ్రమైన చర్చలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, మరో నెలన్నర రోజుల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ గురించి కోహ్లి-రోహిత్ చర్చించి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జట్టు కూర్పు గురించి వారిద్దరు మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు.
మరోవైపు నీతా అంబాని-కోహ్లి చర్చ గురించి నెటిజన్లు తమ ఊహలకు పనిచెప్పారు. ట్రేడింగ్‌లో కోహ్లిని ముంబైకి తీసుకొచ్చే పనిలో ఉందని, రోహిత్ వెళ్లిపోతే మరో సీనియర్‌తో జట్టును భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు కోహ్లి ఫ్యామిలీ గురించి నీతా అంబానీ ఆరాతీసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.