T20 World Cup 2024: ఐపీఎల్ 2024లో యంగ్ క్రికెటర్ల హవా కొనసాగుతోంది. అన్ క్యాప్డ్ ప్లేయర్లు దుమ్ము రేపుతున్నారు. కళ్లు చెదిరే ఇన్నింగ్ ఆడుతున్నారు. 10 మంది వరకు అన్ క్యాప్డ్ ప్లేయర్లు తమ సత్తా చాటారు. టీ20 వరల్డ్ కప్ 2024 బెర్త్‌పై కర్ఛీఫ్ వేసుక్కూర్చుకున్నారు.
పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ భారీ షాట్లతో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ముంబై ఇండియన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో అశుతోష్, శశాంక్ సింగ్ అద్భుతంగా ఆడారు. దాదాపుగా మ్యాచ్‌ను గెలిపించినంత పని చేశారు. 28 బంతులను ఎదుర్కొన్న అశుతోష్ 61 పరుగులు చేశాడు. వారిద్దరూ అన్ క్యాప్డ్ ప్లేయర్లే.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్‌గా ఆడుతున్న అభిషేక్ శర్మ సైతం అన్ క్యాప్డ్ ప్లేయరే. ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, శివమ్ దూబే కంటే అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ ఎక్కువ. రాజస్థాన్ రాయల్స్‌లో రియాన్ పరాగ్, కోల్‌కత నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా తమ సత్తా చాటుతున్నారు ఈ సీజన్‌లో.
ఫాస్ట్ బౌలింగ్ సెన్సేషన్ మయాంక్ సింగ్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తొలి మ్యాచ్‌లోనే అతని బౌలింగ్ రుచి తెలిసింది. స్థిరంగా గంటకు 150కి పైగా వేగంతో బంతులను సంధించే నైపుణ్యం అతని సొంతం. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు మయాంక్ యాదవ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లల్లో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.
ఈ మ్యాచ్‌తో అతను ఓవర్ నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి ఐపీఎల్‌లోనే మూడు వికెట్లు నేలకూల్చడం ఒక ఎత్తయితే, 145 కిలోమీటర్లకు పైగా వేగంతో మూడు ఓవర్లను సంధించడం మరో ఎత్తు. మూడు ఓవర్లు అంటే 18 బంతులను 145 కిలోమీటర్ల సగటు వేగంతో సంధించాడం అంటే మాటలు కాదు. అందులో ఎనిమిది బంతులు 150 కిలోమీటర్లకు పైగా వేగాన్ని రికార్డ్ చేశాయి.
టీ20 వరల్డ్ కప్ 2024 రేసులో మయాంక్ యాదవ్ నిలిచాడంటూ ఇప్పటికే వార్తలొస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఆస్ట్రేలియాకు చెందిన మాజీ ప్లేయర్ టామ్ మూడీ స్పందించాడు. మయాంక్ యాదవ్ వేగం తనను ఆకట్టుకుందని, తొలి రెండు గేమ్‌లల్లో రాణించాడని పేర్కొన్నాడు. అతని బౌలింగ్‌ను తాను రీప్లే వేసుకుని మరీ చూశానని అన్నాడు.
నిలకడగా రాణిస్తోన్నప్పటికీ.. బీసీసీఐ సెలెక్టర్లు టీ20 వరల్డ్ కప్ 2024 కోసం మయాంక్ యాదవ్‌ను ఎంపిక చేయకూడదని అన్నాడు. రెండు మ్యాచ్‌ల తరువాత అతను మోకాలి గాయం బారిన పడటం శుభపరిణామం కాదని వ్యాఖ్యానించాడు. అతని కేరీర్‌ను దెబ్బతీసినట్టవుతుందని అభిప్రాయపడ్డాడు.
టీ20 వరల్డ్ కప్ 2024కు ఎంపిక చేయడం వల్ల అతను మరింత ఒత్తిడిని కొని తెచ్చుకున్నట్టవుతుందని, సుదీర్ఘ క్రికెట్ కేరీర్‌పై అది దుష్ప్ప్రభావం చూపుతుందని టామ్ మూడీ చెప్పాడు. 2026 టీ20 వరల్డ్ కప్ నాటికి అతను మరింత రాటుదేలుతాడని, అప్పుడు అతన్ని జట్టులోకి తీసుకోవాలని అన్నాడు.