Mayank Yadav: ఐపీఎల్ 2024 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ చేసింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించింది. 21 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి ఎగబాకింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 178 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు శిఖర్ ధావన్- 70, జానీ బెయిర్‌స్టో- 42 పరుగులతో రాణించినప్పటికీ.. ఆ తరువాతి బ్యాటర్లు చేతులెత్తేశారు.

లక్నో సూపర్ జెయింట్స్ కొత్త బౌలర్ మయాంక్ యాదవ్.. నాలుగు ఓవర్లల్లో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. మొహసిన్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌తో కొత్త బౌలర్ మయాంక్ యాదవ్ ఓవర్ నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి ఐపీఎల్‌లోనే మూడు వికెట్లు నేలకూల్చడం ఒక ఎత్తయితే, 145 కిలోమీటర్లకు పైగా వేగంతో మూడు ఓవర్లను సంధించడం మరో ఎత్తు.
21 సంవత్సరాల కుర్ర బౌలర్.. మూడు ఓవర్లు అంటే 18 బంతులను 145 కిలోమీటర్ల సగటు వేగంతో సంధించాడు. అందులో ఎనిమిది బంతులు 150 కిలోమీటర్లకు పైగా వేగాన్ని రికార్డ్ చేశాయి. అతను వేసిన ఓ డెలివరి 155.8 కిలోమీటర్లను టచ్ చేసింది. ఈ సీజన్‌లో ఇదే స్పీడ్ డెలివరి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును దక్కించుకున్నాడు తొలి మ్యాచ్‌లోనే.
దీనిపై స్పందించాడు మయాంక్ యాదవ్. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా మాట్లాడాడు. ఐపీఎల్ వంటి బిగ్గెస్ట్ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ ఇంత మంచి ఫలితాలను ఇస్తుందని ఊహించలేదని చెప్పాడు. తన కేరీర్ మొత్తం ఈ మ్యాచ్ గుర్తుండిపోతుందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ డెలివరీ వేయగలుగుతానని కూడా అనుకోలేదని వ్యాఖ్యానించాడు.

జానీ బెయిర్‌స్టో వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్ వికెట్ పడగొట్టడం జీవితాంతం గుర్తుండిపోతుందని మయాంక్ యాదవ్ చెప్పుకొచ్చాడు. మధ్య మధ్యలో స్లోయర్ డెలివరీలు వేయాలని తొలుత భావించానని, కేప్టెన్ నికొలస్ పూరన్ మాత్రం పేస్‌కే ప్రాధాన్యత ఇవ్వాాలని సూచించినట్లు మయాంక్ యాదవ్ తెలిపాడు.
సూపర్ ఫాస్ట్‌గా దూసుకెళ్లే రాకెట్స్, ఫ్లైట్స్, బైక్స్ అంటే తనకు చాలా ఇష్టమని, వాటిపై చిన్నప్పటి నుంచే ఎంతో ఆసక్తి ఉండేదని, అత్యంత వేగంతో కూడుకున్న బంతులను సంధించడానికి ఇదీ ఓ కారణమై ఉండొచ్చని నవ్వుతూ చెప్పాడు. దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్‌ను తన క్రికెటింగ్ ఐడల్‌గా అభివర్ణించాడు మయాంక్.