ఐపీఎల్ 17వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘనంగా బోణీ కొట్టింది. సొంత వేదికగా శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 21 ఏళ్ల LSG ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 199 పరుగులు చేసింది. డికాక్ (54; 38 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కృనాల్ పాండ్య (43*; 22 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (42; 21 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తాచాటారు. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు అదిరే ఆరంభం లభించింది. శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో (42; 29 బంతుల్లో) తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 11.4 ఓవర్లలో 102 పరుగులు సాధించారు. ఆది నుంచే లక్నో బౌలర్లపై దాడికి దిగారు. ఎడాపెడా బౌండరీలతో పవర్‌ప్లేలో 61 పరుగులు బాదారు. ఈ క్రమంలో ధావన్ 29 బంతుల్లో అర్ధశతకం సాధించాడు.
అయితే అరంగేట్ర బౌలర్ మయాంక్ యాదవ్ హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న బెయిర్‌స్టోను ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (19; 7 బంతుల్లో), కాసేపటికీ జితేశ్ శర్మ (6; 9 బంతుల్లో)ను కూడా పెవిలియన్‌కు చేర్చి లక్నోను తిరిగి పోటీలోకి తెచ్చాడు. మయాంక్ సగటున గంటకు 150 కి.మీ వేగంతో బంతులు సంధించడం విశేషం. ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతి వేసిన రికార్డు (155 కి.మీ/గ) సాధించాడు. మోహిన్స్ ఖాన్ కూడా బంతితో మెరవడంతో లక్నోకు ఎదురులేకపోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోకు శుభారంభం లభించలేదు. మ్యాచ్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ (15; 9 బంతుల్లో) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. సిక్సర్, ఫోర్ బాది ఊపు మీదున్న రాహుల్‌ను అర్షదీప్ బోల్తా కొట్టించాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన దేవదత్ పడిక్కల్ (9; 6 బంతుల్లో)ను సామ్‌కరన్, స్టొయినిస్ (19; 12 బంతుల్లో)ను రాహుల్ చాహర్ పెవిలియన్‌ను పంపారు.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పూరన్‌తో కలిసి డికాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలో డికాక్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. అయితే డికాక్-పూరన్ జోరు చూస్తే లక్నో సులువుగా 200+ స్కోరు సాధించేలా కనిపించింది. కానీ బ్రేక్ అనంతరం 14వ ఓవర్‌లో డికాక్‌ను అర్షదీప్ సింగ్ ఔట్ చేశాడు. కాసేపటికే పూరన్‌ను రబాడ క్లీన్ బౌల్డ్ చేయడంతో లక్నో స్కోరు వేగం తగ్గింది. కానీ ఆఖర్లో కలిసి కృనాల్ పాండ్య బ్యాటు ఝుళిపించాడు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి పరుగులు సాధించాడు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు, అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీశారు.