లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్ 200 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ డికాక్ (54; 38 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య (43*; 22 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కొత్త కెప్టెన్ నికోలస్ పూరన్ (42; 21 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సత్తాచాటారు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. అయితే లక్నోకు శుభారంభం లభించలేదు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ (15; 9 బంతుల్లో) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. సిక్సర్, ఫోర్ బాది ఊపు మీదున్న రాహుల్‌ను అర్షదీప్ బోల్తా కొట్టించాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన దేవదత్ పడిక్కల్ (9; 6 బంతుల్లో)ను సామ్‌కరన్, స్టొయినిస్ (19; 12 బంతుల్లో)ను రాహుల్ చాహర్ పెవిలియన్‌ను పంపారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పూరన్‌తో కలిసి డికాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలో డికాక్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించారు.
అయితే డికాక్-పూరన్ జోరు చూస్తే లక్నో సులువుగా 200+ స్కోరు సాధించేలా కనిపించింది. కానీ బ్రేక్ అనంతరం 14వ ఓవర్‌లో డికాక్‌ను అర్షదీప్ సింగ్ ఔట్ చేశాడు. కాసేపటికే పూరన్‌ను రబాడ క్లీన్ బౌల్డ్ చేయడంతో లక్నో స్కోరు వేగం తగ్గింది. కానీ ఆఖర్లో కలిసి కృనాల్ పాండ్య బ్యాటు ఝుళిపించాడు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి పరుగులు సాధించాడు. ఆయుష్ బదోని (8; 10 బంతుల్లో) నిరాశపరిచాడు. సామ్ కరన్ మూడు వికెట్లు, అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీశారు.