ఐపీఎల్‌లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. లక్నో వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. హ్యాట్రిక్ విజయాలో జోరు మీదున్న లక్నో మరో గెలుపుపై కన్నేసింది. సొంతమైదానంలో ప్రత్యర్థిని చిత్తు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన లక్నో ఆరు పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచింది. ఆడిన అయిదింట్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఢిల్లీ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆఖర్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ సీజన్‌లో అత్యధికంగా 14 ఎకానమీ రేటుతో పరుగులిచ్చారు. ఈ లోపాల్ని సరిదిద్దుకుని తిరిగి గెలుపు బాట పట్టాలని ఢిల్లీ కసిగా బరిలోకి దిగుతోంది.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు లక్నో, ఢిల్లీ మూడు సార్లు తలపడ్డాయి. మూడింట్లోనూ లక్నో పైచేయి సాధించింది. అయితే లక్నో జట్టులో యువ స్పీడ్‌గన్ మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో అర్షద్ ఖాన్ జట్టులోకి వచ్చాడ. మరోవైపు ఢిల్లీ జట్టులో కుల్‌దీప్ యాదవ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయంతో కుల్‌దీప్ గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే.
కాగా, టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. ''ఈ పిచ్‌పై ఆడటం ఇదే తొలిసారి. ఇది ఫ్రెష్ పిచ్. ఇక్కడ బౌండరీలు చాలా దూరంలో ఉంటాయి. బౌలర్లు ఈ మైదానాన్ని ఆస్వాదిస్తారు. మయాంక్ యాదవ్ స్థానంలో అర్షద్ ఖాన్ జట్టులోకి వచ్చాడు'' అని తెలిపాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా తొలుత బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని చెప్పాడు. తమ జట్టులో కొంతమంది ప్లేయర్లు గాయపడ్డారని, సమతూకమైన తుదిజట్టు ఎంపికకు ప్రయత్నిస్తున్నామని తెలిపాడు. ముకేశ్ కుమార్, కుల్‌దీప్ యాదవ్ తిరిగొచ్చారని పేర్కొన్నాడు. వారిద్దరి తిరిగి రావడం సంతోషకరమని పంత్ అన్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, మార్కస్ స్టొయినిస్, దేవదత్ పడిక్కల్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్య, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, నవీనుల్ హక్, అర్షద్ ఖాన్.
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిషభ్ పంత్(కెప్టెన్), షై హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, కుల్‌దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.