ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంలోనే అభిమానులకు కిక్కు మొదలైంది. ఉత్కంఠ పోరులు, అబ్బురపరిచే క్యాచ్‌లు, అరుదైన రికార్డులతో ఈ ఐపీఎల్ సీజన్ ఆదిలోనే హీట్ ఎక్కింది. లీగ్ ప్రారంభమై జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనే క్రికెట్ టీ20 చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు నమోదైంది.
ఈడెన్‌గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో చారిత్రక రికార్డు నెలకొంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. అయితే భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్‌లో రసెల్ (64; 25 బంతుల్లో) విధ్వంసం సృష్టించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 26 పరుగులు రాబట్టుకున్నాడు.

అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. అయితే ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లోనూ 26 పరుగులు వచ్చాయి. స్టార్క్ వేసిన 19వ ఓవర్‌లో హెన్రిక్ క్లాసెన్ (63; 29 బంతుల్లో) మూడు సిక్సర్లు, షాబాజ్ అహ్మద్ (16; 5 బంతుల్లో) ఓ సిక్సర్ బాదాడు. అయితే టీ20 క్రికెట్ చరిత్రలో ఇరు జట్లు 19 ఓవర్‌లో చెరో 26 పరుగులు సాధించడం ఇదే తొలిసారి. రెండు టీమ్స్ కలిపి ఈ ఓవర్‌లో సాధించిన 52 పరుగులే అత్యధికం.
అంతేగాక యాదృచ్చికంగా 20 ఓవర్‌లోనూ కోల్‌కతా, హైదరాబాద్ జట్లు 8 పరుగులే సాధించాయి. ఇలా 19వ ఓవర్, 20 ఓవర్‌లో ప్రత్యర్థి జట్లు సేమ్ స్కోరు సాధించడం చాలా అరుదైన ఘటన. కాగా, ఈ మ్యాచ్‌లో 200 సిక్సర్ల మార్క్‌ను అందుకన్న రసెల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 200 సిక్సర్లు బాదిన వేగవంతమైన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ ఘనత సాధించడానికి రసెల్ 1322 బంతులు తీసుకోగా, రెండో స్థానంలో ఉన్న క్రిస్ గేల్ 1811 బంతులు ఎదుర్కొన్నాడు.