Mitchell Starc: ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ తన విజయాల పరంపరను కొనసాగిస్తోంది. తన సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ను కూడా కాపాడుకోగలిగింది. పరాజయం అంచుల వరకూ వెళ్లినా మడమ తిప్పలేదు. ఒక పరుగు తేడాతో విజయాన్ని అందుకోగలిగింది కోల్‌కత నైట్‌రైడర్స్.
ఆదివారం మధ్యాహ్నం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఒకరిద్దరు తప్ప మిగిలిన బ్యాటర్లు మొత్తం సత్తా చాటారు. స్కోర్ బోర్డుపై భారీగా పరుగులను జమ చేయడానికి కృషి చేశారు.

ఫిల్ సాల్ట్- 48, శ్రేయాస్ అయ్యర్- 50, రింకూసింగ్- 24, ఆండ్రీ రస్సెల్- 26 (నాటౌట్), రమణ్‌దీప్ సింగ్ ధాటిగా ఆడటం వల్ల స్కోర్ 220 పరుగులను దాటింది. ఆ టార్గెట్‌ను ఛేదించడానికి చిట్టచివరి వరకూ పోరాడింది ఆర్సీబీ. 20 ఓవర్లల్లో 221 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఒక్క పరుగు తేడాతో ఓడింది.
ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ సంధించిన మిఛెల్ స్టార్క్.. కేకేఆర్ టీమ్‌తో పాటు అభిమానులనూ టెన్షన్ పెట్టించిన విషయం తెలిసిందే. చివరి ఆరు బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన దశలో బౌలింగ్‌కు దిగాడు స్టార్క్. 1, 3,4 బంతులను సిక్సర్లుగా మలిచాడు కర్ణ్ శర్మ. దీనితో ఈక్వేషన్లు రెండు బంతుల్లో మూడు పరుగులుగా మారింది.
నాలుగో బంతిని లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడబోయాడు కర్ణ్ శర్మ. అతని బ్యాట్ నుంచి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చిన బంతిని సక్సెస్‌ఫుల్‌గా అందుకున్నాడు స్టార్క్. చివరి బంతికి లోకీ ఫెర్గూసన్ రనౌట్ కావడంతో ఆర్సీబీ ఇన్నింగ్‌కు తెర పడింది. ఈ మ్యాచ్‌లో మిఛెల్ స్టార్క్ మూడు ఓవర్లల్లో 55 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు.

ఈ సీజన్ మొత్తానికి కూడా అతను అంచనాలకు తగ్గట్టుగా ఆడట్లేదు. వికెట్లను పడగొట్టలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లను స్టార్క్ ఆరు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. 287 పరుగులు ఇచ్చుకున్నాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 3/28.
స్టార్క్‌ను 24.75 కోట్ల రూపాయలు పెట్టి హైర్ చేసుకుంది కేకేఆర్. ఆ స్థాయిలో మాత్రం అతను ఆడట్లేదనేది ఈ లెక్కలను బట్టి ఇట్టే చెప్పేయొచ్చు. అయినప్పటికీ- అతనిపై కోల్‌కత నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ గట్టి నమ్మకాన్నే పెట్టుకుంది. స్టార్క్ ఫెయిల్యూర్స్‌పై తొలిసారిగా కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ స్పందించారు.
స్టార్క్‌ను ఓ సూపర్ స్టార్‌గా, క్వాలిటీ ప్లేయర్‌గా అభివర్ణించారు. అతన్ని పెట్టుబడి రూపంలో చూడలేమని వ్యాఖ్యానించారు. మెగా ఆక్షన్ సందర్భంగా ఎలాంటి ప్లేయర్‌ను తీసుకోవాలనేది ముందుగానే ప్లాన్ చేసుకుంటామని, అతని ఆటతీరు ఎలా ఉంటుందనేది అన్ ప్లాన్డ్‌గా ఉంటుందని పేర్కొన్నారు.
స్టార్క్ వంటి ప్లేయర్ ఉంటే జట్టుకు అదనపు బలం అవుతుందని వెంకీ మైసూర్ అన్నారు. గెలుపోటములు లేదా ప్లేయర్ ఫామ్‌ను కోల్పోవటం సర్వసాధారణమేనని చెప్పారు. ఫామ్‌లోకి వచ్చినప్పుడు స్టార్క్ గేమ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందేనని అన్నారు. అతన్ని జట్టులోకి తీసుకోవడం పట్ల ఫ్రాంఛైజీ సూపర్ హ్యాపీగా ఉందని పేర్కొన్నారు.