Gautam Gambhir: ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌పై ఓడిపోయింది. ఆ జట్టుకు ఇది వరుసగా ఆరో ఓటమి. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లల్లో ఆర్సీబీ గెలిచింది ఒక్కటే. ఈ వరుస ఓటముల తరువాత ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలను దాదాపుగా కోల్పోయినట్టయింది.
ఆదివారం మధ్యాహ్నం కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఒక పరుగు తేడాతో ఓడిపోయింది ఆర్సీబీ. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ను ఛేదించడానికి చిట్టచివరి వరకూ పోరాడింది ఆర్సీబీ. 20 ఓవర్లల్లో 221 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరు విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్ తొలి బంతికి అవుట్ అయ్యాడు కోహ్లీ. నడుం కంటే ఎత్తులో దూసుకొచ్చిన ఫుల్ టాస్ డెలివరీ అది. దాన్నిసరిగ్గా అంచనా వేయలేకపోయాడు కోహ్లీ. ఆ బంతిని ఎదుర్కొనడానికి బ్యాట్‌ను అడ్డు పెట్టాడు. బ్యాట్ పైఅంచుకు తగిలిన ఆ బంతిని హర్షిత్ రాణా అలవోకగా అందుకున్నాడు.
నడుం కంటే ఎత్తులో బౌలర్ సంధించిన డెలివరీని నో బాల్‌గా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ బంతికి అంపైర్ అవుట్ ఇవ్వడంతో కోహ్లీ రివ్యూ సైతం తీసుకున్నాడు గానీ అది సక్సెస్ కాలేదు. అది అవుట్‌గా తేల్చారు అంపైర్. క్రీజ్ నుంచి కోహ్లీ బయట ఉండటం వల్లే అవుట్ ఇవ్వాల్సి వచ్చిందంటూ చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్.

అదే మ్యాచ్‌లో కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ సైతం అంపైర్‌తో ఆర్గ్యూ చేస్తూ కనిపించాడు. అతనికి హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ కూడా తోడయ్యాడు. కేకేఆర్ ఇన్నింగ్ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సునీల్ నరైన్ స్థానంలో రహ్మనుల్లా గుర్బాజ్‌ను సబ్‌స్టిట్యూట్‌గా తీసుకుని రావాలని వారు భావించారు. కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నిర్ణయానికి ఆన్ ఫీల్డ్ అంపైర్ అంగీకరించలేదు.
దీనితో శ్రేయాస్ అయ్యర్.. డగౌట్ వైపు చూస్తూ అసహనంగా ఏదో చెప్పడం కనిపించింది. ఆ వెంటనే డగౌట్‌లో ఉన్న గౌతమ్ గంభీర్, చంద్రకాంత్ పండిట్.. అక్కడే ఉన్న ఫోర్త్ అంపైర్‌తో వాగ్వివాదానికి దిగారు. తన నాలుగు ఓవర్ల కోటాను సునీల్ నరైన్ అప్పటికే కంప్లీట్ చేయడం వల్ల సబ్‌స్టిట్యూట్‌కు అనుమతి ఇవ్వబోమని అంపైర్ తేల్చి చెప్పారు.