Dinesh Karthik: ఐపీఎల్ 2024 సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్. బలమైన కోల్‌కత నైట్ రైడర్స్‌తో తలపడుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆర్సీబీ కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్. ఈడెన్ గార్డెన్స్ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అందుకే ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు తెలిపాడు.
ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో మూడు మార్పులు చేసింది ఆర్సీబీ. మహ్మద్ సిరాజ్, కామెరాన్ గ్రీన్, కర్ణ్ శర్మలను ప్లేయింగ్ 11లోకి తీసుకుంది. రీస్ టోప్లేను పక్కన పెట్టింది. ఈ ప్రయోగం పెద్దగా ఫలితాన్ని ఇచ్చినట్లు కనిపించట్లేదు. మహ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లోనే 12 పరుగులను పిండుకున్నారు కోల్‌కత నైట్‌రైడర్స్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్.

తొలి ఓవర్ రెండో బంతిని సిక్స్‌గా మలిచాడు ఫిల్ సాల్ట్. మూడు బంతినీ పనిష్ చేశాడు. ఆఫ్ స్టంప్ సమీపంలో పడ్డ లెంగ్త్ డెలివరీని మిడ్ వికెట్ మీదుగా లాఫ్టింగ్ షాట్ ఆడాడు. సింగిల్ బౌన్స్‌తో బౌండరీ లైన్ క్రాస్ చేసిందా బంతి. ఆ తరువాత కూడా ఓపెనర్ల దూకుడుకు బ్రేక్ పడలేదు. యష్ దయాళ్ వేసిన రెండో ఓవర్‌లోనూ 11 పరుగులొచ్చాయి.
కాగా- ఈ మ్యాచ్ ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్‌కు ఓ చిరస్మరణీయమైనదిగా మిగిలిపోనుంది. ఐపీఎల్‌లో ఇది అతనికి 250వ మ్యాచ్. ఇప్పటివరకు 249 గేమ్‌లను ఆడాడు డీకే. ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లను ఆడిన మూడో బ్యాటర్ అతనొక్కడే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
2008 నుంచి క్రమం తప్పకుండా ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడుతూ వస్తోన్నాడు దినేష్ కార్తీక్. గతంలో కోల్‌కత నైట్ రైడర్స్‌కు కేప్టెన్‌గా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే ఐపీఎల్.. అతని కేరీర్‌ను సజీవంగా ఉంచగలిగింది. మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కేలా చేసింది.
ఐపీఎల్ కేరీర్‌లో ఇప్పటివరకు 4,742 పరుగులు చేశాడు దినేష్ కార్తీక్. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 97 నాటౌట్ అతని వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్. 26.64 బ్యాటింగ్ యావరేజ్‌ను నమోదు చేశాడు. 134.98 స్ట్రైక్ రేట్‌తో అతని బ్యాటింగ్ పరుగులు పెడుతోంది. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే దినేష్ కార్తీక్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడు.